TG ICET 2025 Exams: తెలంగాణ ఐసెట్‌కు సర్వం సిద్ధం.. రేపట్నుంచే ఆన్‌లైన్ పరీక్షలు!
రాష్ట్రంలో ఐసెట్ 2025 పరీక్ష రేపట్నుంచి (జూన్ 8) ప్రారంభంకానుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 8,9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్ 2025) పరీక్ష రేపట్నుంచి (జూన్ 8) ప్రారంభంకానుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 8,9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఐసెట్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 జోన్లలో 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహాత్మాగాంధీ వర్సిటీ తెలిపింది.
ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు మొదటి రోజున రెండు సెషన్‌లలో, రెండో రోజు ఒక సెషన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71,757 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 37,331 మంది మహిళలు, 34,409 మంది పురుషులు, ఇతరులు 17 మంది ఉన్నారు. ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఐసెట్ పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి ఈ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీఈ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 2025- 26 విద్యా సంవత్సరానికిగానూ విద్యాహక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో పేద విద్యార్థుల ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పాఠశాలల్లో చేరేందుకు గడువును పొడిగించినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తాజా ప్రకటన మేరకు తుది గడువు జూన్ 10 వరకు పొడిగించారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదింటి పిల్లలకు భర్తీ చేయనున్నారు. మొదటివిడతలో 23,117 మందికి సీట్లు కేటాయించారు. వారంతా జూన్ 7లోపు ఆయా పాఠశాలల్లో చేరాలని సూచించారు. జూన్ 7న బక్రీద్, జూన్ 8న ఆదివారం సెలవుల కారణంగా గడువును.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇక రెండో విడత ఆర్టీఈ ప్రవేశాల ఫలితాలను జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. రెండో విడతలో సీట్లు పొందినవారు జూన్ 21లోపు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.