TGPSC Group 1 Re-evaluation: ‘గ్రూప్ 1 జవాబు పత్రాలు రీవాల్యుయేషన్ చేయాల్సిందే’.. టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు!
మొత్తం 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులన భర్తీకి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ దాఖలు చేసిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక విధంగా హైకోర్టుకు వరుస ఫిర్యాదులు చేరుతూనే ఉన్నాయి. తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రాథమిక జాబితాను టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేయగా.. అభ్యర్ధులు తమకు వచ్చిన మార్కులతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు..

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల రగడ మళ్లీ రాజుకుంది. గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్ధులకు తీవ్ర అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం దీనిపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ..
గ్రూప్ 1 పరీక్షలకు మొత్తం 18 రకాల సబ్జెక్టులుంటే.. కేవలం 12 రకాల సబ్జెక్ట్ నిపుణులతోనే పేపర్లను వాల్యుయేషన్ చేయించినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. మూడు భాషల్లో పరీక్షలు జరిగినా తగిన అర్హతలున్న నిపుణులతో పేపర్లను దిద్దించలేదని అన్నారు. ఒకే మీడియంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లను మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకం చేసినవారిలో చాలామందికి తెలుగు, ఉర్దూ తెలియదని అన్నారు. దీంతో ఆ భాషల్లో పరీక్షలు రాసినవారికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు.
అనంతరం టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. పిటిషనర్ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించించింది. ఈ మేరకు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు. కాగా తెలంగాణ గ్రూప్ 1 ప్రాథమిక జాబితాను టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 మార్కుల రీకౌంటింగ్‌కు మార్చి 24 సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగిసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.