Gurukula 5th Class Admissions 2025: ఫిబ్రవరి 23న గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్.. నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు మరో పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్‌ వర్షిణి తెలిపారు..

Gurukula 5th Class Admissions 2025: ఫిబ్రవరి 23న గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్.. నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?
Gurukula 5th Class Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2024 | 3:39 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబర్ 18వ తేదీన విడుదలకానుంది. ఈ మేరకు గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్‌ వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2025 వచ్చేఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల ప్రవేశాలు మే 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. పదో తరగతి పాసైన ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు సొసైటీ పరిధిలోని జూనియర్‌ కళాశాలల్లో ఎలాంటి ప్రవేశ పరీక్షలేకుండానే నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రవేశపరీక్ష దరఖాస్తు, సొసైటీల వారీగా సీట్ల కేటాయింపు మరింత సరళీకృతం చేశామని కన్వీనర్‌ వర్షిణి వివరించారు. ఈ మేరకు సంక్షేమ భవన్‌లోని సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు గురుకుల విద్యాలయాల్లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన సంగతి తెలిసిందే. పలువురు విద్యార్ధులు అనారోగ్యం పాలవడంతో వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ తరహా ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సరకుల నిల్వ డబ్బాలు కొనేందుకు గురుకుల పాఠశాలకు రూ.20 వేల చొప్పున కేటాయించామని, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా బయటి వారు ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త మెనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రాజకీయాల కోసం గురుకుల విద్యా సంస్థలను వాడుకోవద్దని సూచిస్తున్నామని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.