10th Class Exam Fee: ఇక ‘ఆన్‌లైన్’లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
గతంలో పదో తరగతి పరీక్ష ఫీజులను ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బ్యాంకుకు వెళ్లి చలానా తీసి చెల్లించేవారు. కానీ ఈ పాతకాలం పద్ధతులకు ప్రభుత్వం ఇకపై స్వస్తి చెప్పాలని భావిస్తుంది. అందుకే ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది..
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఫీజు చెల్లింపులు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుము చెల్లిస్తే.. ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. అయితే ఇకపై ఇలా చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇక నుంచి పదో తరగతి పరీక్షల ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని తెలిపింది. ఆ మేరకు చలానా విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి పరీక్షల ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 18వ తేదీలోగా పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది.
రూ.50 నుంచి రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 21వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చింది. పరీక్షల ఫీజును రూ.125గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలలోపు ఉన్నట్లయితే వారంతా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలని, ఇటువంటి వారందరికీ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు.