Inspirational Stories: ఏకంగా 6 సర్కారు కొలువులు దక్కించుకున్న ఆదిలాబాద్ తండా యువతి.. స్ఫూర్తిదాయక గాథ
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో ఆదిలాబాద్ తండాకు చెందిన ఓ యువతి ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకుంది. ఎలాంటి సౌకర్యాలులేని మారు మూల గ్రామంలో ఆమెతోపాటు దాదాపు 90 మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది..
ఆదిలాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ జిల్లాలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. సరైన వైద్య, నీటి, రోడ్డు సదుపాయాలు లేవు. ఇక చదువు విషయానికొస్తే సరేసరి. ఇక్కడి చాలా గ్రామాల్లో బడులే లేవు. ఒకవేళ ఉన్నా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్నాయి. ఇలా అరకొర సదుపాయాలున్న ఈ జిల్లాల్లో ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటేనే అందని ద్రాక్షలా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ జిల్లాల్లో పలువురు సర్కార్ కొలువులు సొంతం చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం చిన్న పల్లె నుంచి కూడా పలువురు యువతీ యువకులు ఈ ఏడాది సర్కార్ కొలువులు సొంతం చేసుకున్నారు. గతంలో ఈ గ్రామానికి చెందిన ప్రతాప్‌సింగ్, శ్రావణ్‌కుమార్ అప్పటి జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం ఆ పల్లెని ఓ మలుపుతిప్పింది. వారిని ప్రేరణగా తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని పట్టుబట్టారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారి సంఖ్య అక్షరాలా 82 మందికి చేరింది. వీరంతా రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం వంటి వివిధ శాఖల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన పలు ప్రభుత్వ నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా తండాకు చెందిన ఓ యువతి ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది. గురుకుల డీఎల్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచిందా యువతి. చిన్నబుగ్గారానికి చెందిన నిఖితకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే మహా ఇష్టం. ఎప్పటికైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనేది ఆమె లక్ష్యం. దీంతో ప్రయత్నాలు ప్రారంభించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడాది వ్యవధిలోనే ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. గతేడాది 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు జరిగిన పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమై.. పరీక్షలు రాసింద. రోజుకి 7 నుంచి 10 గంటల వరకు ష్టపడి చదివి అనుకున్నది సాధించింది. మొదట సోషల్ వెల్ఫేర్‌లో పీజీటీగా, ఆ తర్వాత టీజీటీ అనంతరం.. జేఎల్, డీఎల్, గ్రూప్ 4 పోస్టులకు వరుసగా ఎంపికైంది. తాజాగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన జేఎల్ పరీక్షలోనూ సత్తా చాటింది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పేదరికం అడ్డు కాదని నిఖిత నిరూపించింది.
మేఘాలయ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసే ఇందల్‌కుమార్, హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేసే భూగర్భ నిపుణులు డాక్టర్ లోహిత్‌కుమార్, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జైసింగ్ కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారే. ఏడాది కిందట ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో పరీక్ష రాసి ఇటీవల 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన నిఖిత ఈ గ్రామానికి చెందిన యువతే. ఇక్కడ ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నవారు, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు.