AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ.1కే వైద్యం.. ఈ డాక్టర్ బాబు సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

వైద్యం అంటే వ్యాపారం కాదని నిరూపిస్తున్నారు ఒడిశాకు చెందిన ఓ వైద్యుడు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే లక్ష్యంతో కేవలం రూ.1కే వైద్య సలహా అందిస్తున్న డాక్టర్ శంకర్ రామ్‌చందానీ తాజాగా మరో ముందడుగు వేశారు. ఇకపై ఆయన క్లినిక్‌లో ECG, స్పైరోమెట్రీ, బోన్ మినరల్ డెన్సిటీ (BMD) పరీక్షలను కూడా కేవలం రూ.1కే అందిస్తున్నారు. దీంతో ఆయనను స్థానికులు ప్రేమగా ‘రూ.1 డాక్టర్‌’ అని పిలుస్తున్నారు..

కేవలం రూ.1కే వైద్యం.. ఈ డాక్టర్ బాబు సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
One Rupee Doctor In Odisha
Srilakshmi C
|

Updated on: Sep 07, 2026 | 9:53 AM

Share

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్ రామ్‌చందానీ ఇప్పటికే రూ.1కే వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా పేదలు, దివ్యాంగులు ఖరీదైన వైద్య పరీక్షల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తన సేవలను మరింత విస్తరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో సాధారణంగా సుమారు రూ.1000 వరకు ఖర్చయ్యే స్పైరోమెట్రీ, BMD పరీక్షలను ఆయన క్లినిక్‌లో కేవలం రూ.1కే అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పైరోమెట్రీ పరీక్ష ప్రధానంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. BMD పరీక్ష ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో ఎముకల బలహీనతను గుర్తించవచ్చు.

రూ.1కే మందులు, నెబ్యులైజర్‌ సేవలు కూడా..

డాక్టర్ శంకర్‌ కేవలం కన్సల్టేషన్‌, వైద్య పరీక్షలకే పరిమితం కాలేదు. పేద రోగులకు అవసరమైన మందులు, నెబ్యులైజర్‌, దివ్యాంగులకు ఉపయోగపడే కర్రలను కూడా రూ.1కే అందిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శిఖా రామ్‌చందానీ కూడా పేదలకు రూ.1కే దంత వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ శంకర్‌ రామ్‌చందానీ 2016 నుంచి బుర్లాలోని VIMSAR మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు తన క్లినిక్‌లో రాత్రి 9 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు.

తాను చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని డాక్టర్ శంకర్‌ తెలిపారు. తన కళ్ల ముందే తాత, మామ క్యాన్సర్‌తో మృతి చెందారని, ఆ సమయంలో కుటుంబానికి చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేవని గుర్తుచేసుకున్నారు. అప్పుడే పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి తర్వాత తన తల్లిదండ్రుల కలను నెరవేర్చేందుకు ఈ చిన్న క్లినిక్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పేదల్లో ఊపిరితిత్తుల, ఎముకలకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు స్పైరోమెట్రీ, BMD పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

లక్షల రూపాయలు ఖర్చు చేసి యంత్రాల కొనుగోలు

రూ.1కే పరీక్షలు అందించేందుకు డాక్టర్ శంకర్‌ లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. స్పైరోమెట్రీ పరీక్ష నిర్వహించే యంత్రం సుమారు రూ.1 లక్ష, BMD యంత్రం సుమారు రూ.9 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తాను దేశంలోనే తొలిసారిగా స్పైరోమెట్రీ, BMD పరీక్షలను రూ.1కే అందిస్తున్న వైద్యుడినని ఆయన పేర్కొన్నారు. సంబల్‌పూర్‌, ఝార్సుగూడ, రూర్కెలా, హిరాకుడ్ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఉండటంతో అక్కడి ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. అలాంటి వారికి ఈ క్లినిక్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు.

రోగి మందాకిని దాస్‌ మాట్లాడుతూ.. బయట సుమారు రూ.1,000 ఖర్చయ్యే పరీక్షను ఇక్కడ కేవలం రూ.1కే చేయించుకున్నానని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో కన్సల్టేషన్‌ ఫీజు కనీసం రూ.500 ఉంటుందని, ఇక్కడ మాత్రం రూ.1కే వైద్యుడిని సంప్రదించవచ్చని తెలిపారు. డాక్టర్ శంకర్‌ సేవలను చూసిన జయంత్ పట్నాయక్‌.. ఒడిశా వైద్య సేవల చరిత్రలో ఆయన మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. ‘మానవ సేవే మహా సేవ’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న డాక్టర్ శంకర్‌, ఆయన భార్య శిఖా ప్రతి ఏడాది పేదల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఈ సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

Follow Us