Cigarette Prices: సిగరెట్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు.. ఇప్పుడు ఒకేసారి ఎంతంటే..?
సిగరెట్ల ధరలు మరోసారి పెంచుతూ ఐటీసీ నిర్ణయం తీసుకుంది. గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం, కనెక్ట్ ధరలను పెంచింది. ఫిబ్రవరిలో ధరలు పెరగ్గా.. ఇప్పుడు మరో 7 శాతం మేర పెంచాయి. దీంతో ధూమపానం చేసేవారిపై అదనపు భారం పడుతోంది. కొంతమంది సిగరెట్లు తాగేందుకు వెనకడుగు వేస్తున్నారు.

సిగరెట్లు తాగేవారికి బ్యాడ్‌న్యూస్. సిగరెట్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ధరలు పెరగ్గా.. ఇప్పుడు మరోసారి పెరగడంతో ధూమపానం చేసేవారు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. తాజాగా ఐటీసీ తన బ్రాండ్ సిగరెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోల్డ్ ఫ్లేక్ ప్రీమియంతో పాటు పలు బ్రాండ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐటీసీ సిగరెట్ ధరలను పెంచడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. పెరిగిన జీఎస్టీ ధరలు, అదనపు సుంకాలతో కంపెనీపై తీవ్ర భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వివియోగదారులకు దీనిని బదిలీ చేస్తోంది. పెరిగిన ఖర్చులు, జీఎస్టీ, అదనపు సుంకాలతో ధరలను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ధరలు ఎంత పెరిగాయంటే..?
మొన్నటివరకు 10 సిగరెట్ల గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ప్యాకెట్ ధర రూ.125గా ఉండగా.. ఇప్పుడు రూ.135 పెంచుతూ ఐటీసీ నిర్ణయం తీసుకుంది. అంటే ఒకేసారి 8 శాతం మేర ధరలు పెంచారు. జూన్‌లో ఈ సిగరెట్ ప్యాక్ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచారు. అంటే అప్పట్లో 8.7 శాతం మేర పెంచగా.. ఇప్పుడు మరో 8 శాతం పెంచారు ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 17.4 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ ఏడాది మొదట్లో రూ.115గా ఉండగా.. తాజా పెంపుతో రూ.135కి చేరుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం 40 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకం కూడా విధించింది. సిగరెట్ పొడవు, ఫిల్టర్‌ను బట్టి ఎక్సైజ్ సుంకం విధిస్తారు.
పెరిగిన గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ప్యాక్
ఇక గోల్డ్ ఫ్లేక్ ప్రీమియంతో పాటు ఇతర బ్రాండ్ ధరలను కూడా ఐటీసీ పెంచింది. 20 క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ల ప్యాక్ ధరను రూ.390 నుంచి రూ.428కి పెంచింది. అంటే 9.74 శాతం మేర పెంచినట్లయింది. ఇక 10 సిగరెట్ల గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ప్యాక్ ధరను రూ.79 నుంచి రూ.89కి పెంచింది. అంటే 12.66 శాతం పెంచింది. ఫిబ్రవరిలో క్లాసిక్ నెక్ట్ సిగరెట్ ధరను రూ.300 నుంచి రూ.360కి పెంచగా.. ఇప్పుడు రూ.390కి పెంచారు. ఇక ఫిబ్రవరిలో గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ధర రూ.59గా ఉండగా.. ఇప్పుడు రూ.70కి పెరిగింది. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ పెంచడం, అదనపు ఎక్సైజ్ సుంకాలు విధించడంతో కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. అయితే సిగరెట్ తాగేవారిపై ఎక్కువ భారం పడుతోంది. పెరిగిన ధరలతో సిగరెట్ తాగాలంటేనే వెనకడుగు వేస్తున్నారు.
