దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఒకటి. కేంద్ర ప్రభుత్వ హామీతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఈ స్కీములో పొందవచ్చు
పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అత్యవసరమైన సమయాల్లో రుణం కూడా పొందవచ్చు. తక్షణమే మీరు నగదు పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. దీని వల్ల మీ పెట్టుబడిని కొనసాగించవచ్చు.
పీపీఎఫ్ అకౌంట్‌లో ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. మీకు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుని అకౌంట్ మూసివేయాల్సిన అవసరం లేదు.
పీపీఎఫ్ అకౌంట్‌పై రుణం సులువుగా పొందవచ్చు. దీని వల్ల తక్షణం మీ నగదు అవసరాలు తీరడంతో పాటు మీ పొదుపుపై వడ్డీని సంపాదించేలా చేస్తుంది.
అయితే అకౌంట్ తెరవగానే రుణ సౌకర్యం అనేది అందుబాటులో ఉండదు. మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణానికి అర్హత సాధిస్తారు.
ఉదాహరణకు మీరు 2023లో అకౌంట్ తెరిస్తే.. 2025-26 నుంచి 2028-29 ఆర్ధిక సంవత్సరం వరకు రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రుణం కోసం దరఖాస్తు చేయడానికి రెండేళ్ల ముందు అందుబాటులో ఉన్న ఖాతా నిల్వలో గరిష్టంగా 25 శాతం వరకు రుణం పొందవచ్చు. ఉదాహరణకు రెండేళ్ల ముందు రూ.2 లక్షల బ్యాలెన్స్ ఉంటే రూ.50 వేల వరకు రుణం అందుతుంది.
PPF రుణం కోసం మీరు ఖాతా తెరిచిన బ్యాంకులో ఫారం D ని పూరించాలి. మీ PPF ఖాతా వివరాలు, పాస్‌బుక్ కాపీ, గుర్తింపు ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.
బ్యాంకు అధికారులు మీ దరఖాస్తు వివరాలను, బ్యాలెన్స్ హిస్టరీని పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు. వీటిని పీపీఎఫ్‌తో అనుసంధానించబడ్డ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తారు.