JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
JEE Main 2026 Schedule Released: జేఈఈ మెయిన్ (JEE Main 2026) సెషన్ 1, 2 పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షషెడ్యూల్‌ను ఎన్టీయే ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాదికి జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నాయి..

హైదరాబాద్, అక్టోబర్ 20: జేఈఈ మెయిన్ (JEE Main 2026) సెషన్ 1, 2 పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షషెడ్యూల్‌ను ఎన్టీయే ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాదికి జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నాయి. ఇక సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు తాజా షెడ్యూల్‌లో తెలిపింది. అయితే ఇవి తాత్కాలిక తేదీలు మాత్రమే.. ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత వెల్లడించనున్నట్లు ఎన్టీయే తన ప్రకటనలో తెలిపింది. తొలి విడతకు ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ నెలలోనే ప్రారంభంకానున్నాయి. ఇక మలి విడత దరఖాస్తులు జనవరి చివరి వారంలో స్వీకరిస్తామని ఎన్టీయే వివరించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్‌టీఏ ఇంకా ఖరారు చేయలేదు. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది.
యేటా జేఈఈ మెయిన్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 24 లక్షలకుపైగా విద్యార్ధులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఎగ్జామ్ సిటీల సంఖ్యను పెంచడంపై దృష్టిసారించినట్లు ఎన్టీయే పేర్కొంది. దివ్యాంగ అభ్యర్ధులు కూడా పరీక్షకు హాజరయ్యేందుకు మార్గాలను సులభతరం చేస్తున్నట్లు తెలిపింది. జేఈఈ (మెయిన్) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటన వెలువరించింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియ సమయంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.
ముఖ్యంగా ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం సరిగా ఉండేలా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అప్పుడే యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుందని వెల్లడించింది. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరీ సర్టిఫికెట్‌తను చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలకు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




