NEET Paper Leak: ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్.. సీబీఐ విచారణలో సంచలన నిజాలు
NEET Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రాజస్థాన్ జైపూర్‌కు చెందిన బివాల్ కుటుంబం కేంద్రంగా మారింది. 2025 NEETలో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మంచి ర్యాంకులతో సీట్లు సాధించగా, ఇప్పుడు వారి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన బివాల్ కుటుంబం ఇప్పుడు కేంద్రబిందువుగా మారింది. 2025 NEET పరీక్షలో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మంచి ర్యాంకులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించడంతో అప్పట్లో వారిపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు అదే విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దినేశ్ బివాల్ అనే వ్యక్తి 2025లో సోషల్ మీడియాలో తమ కుటుంబంలోని ఐదుగురు విద్యార్థులు NEET క్లియర్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారని గర్వంగా పోస్టు చేశారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన దర్యాప్తులో దినేశ్‌తో పాటు అతని సోదరుడు మంగీలాల్‌పై దృష్టి సారించారు. మంగీలాల్ మేనల్లుడు వికాశ్‌కు NEET పేపర్ లీక్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
NEET 2025లో భారీ స్కోర్లు
దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కుటుంబంలోని పలువురు విద్యార్థులు పదో, ఇంటర్‌లో సాధారణ స్థాయి మార్కులు మాత్రమే సాధించినప్పటికీ, NEET 2025లో భారీ స్కోర్లు నమోదు చేశారు. గత సంవత్సరాల్లో వారి NEET స్కోర్లు, కోచింగ్ టెస్టుల ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండగా, ఒక్కసారిగా అత్యధిక శాతం మార్కులు రావడం అనుమానాలకు దారితీసింది.
అసాధారణ పెరుగుదల..
వికాశ్ అనే విద్యార్థి 2024 NEETలో తక్కువ మార్కులు సాధించగా, 2025లో మాత్రం మెడికల్ సీటు పొందాడు. అలాగే కుటుంబంలోని ఇతర సభ్యుల స్కోర్లలో కూడా అసాధారణ పెరుగుదల కనిపించిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే ఇప్పటివరకు 2025 NEET పేపర్ లీక్‌కు ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు.
ఇక 2026 NEET పేపర్ లీక్ కేసు విచారణలో శుభమ్ ఖైర్‌నార్ అనే వ్యక్తిని నాసిక్‌లో అరెస్టు చేశారు. అతను లీకైన ప్రశ్నాపత్రాన్ని పలు అభ్యర్థులకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూణేకు చెందిన యశ్ యాదవ్ ద్వారా బివాల్ కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం.
ఇటీవల సీబీఐ బృందాలు మంగీలాల్, దినేశ్ బివాల్ నివాసాల్లో సోదాలు నిర్వహించాయి. ఇద్దరు సోదరులతో పాటు వికాశ్‌ను అరెస్టు చేసి పోలీసు కస్టడీకి తరలించారు. ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ వాహనాలు కూడా తనిఖీ చేశారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దినేశ్ కుమారుడు రిషి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
