‘ఇది సరైన మార్గమే.. కానీ రాజకీయం చేయొద్దు’.. CJP కాక్రోచ్‌ల ఉద్యమానికి సల్మాన్, అన్నా హజారే మద్దతు
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు గళం విప్పారు. తాజాగా విద్యార్ధుల ఆందోళనకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపారు..

న్యూఢిల్లీ, జులై 23: సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఉధ్యమంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సల్మాన్.. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను అభినందించారు. అయితే ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని రాజకీయ పార్టీలకు సూచించారు. జూలై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడం తనను బాధించిందని సోషల్ మీడియా పోస్టులో సల్మాన్ పేర్కొన్నారు. ఈ ఘటనల్లో గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు సంఘీభావం వ్యక్తం చేశారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యను అత్యంత తీవ్రమైన అంశంగా అభివర్ణించిన సల్మాన్.. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థులు ఐక్యంగా నిలబడటం ప్రశంసనీయమని అన్నారు. విద్యార్ధులకు అండగా నిలిచిన వారి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళన సరైన దిశలో సాగుతోంది. విద్య కోసం పోరాడుతున్న ఈ యువత దేశానికి గర్వకారణం అవుతుందని సల్మాన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య ఉన్నదేనని, దీనికి రాజకీయ రంగు పులమరాదని సల్మాన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చే గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. పరీక్షలలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమానికి సినీ సెలబ్రెటీల నుంచి కూడా విస్తృత మద్దతు లభిస్తోంది. సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, దుల్కర్ సల్మాన్, పూజా భట్, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సహా ఇప్పటికే కాక్రోచ్‌లకు మద్దతు ప్రకటించారు.
View this post on Instagram
ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
ఈ క్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా స్పందించారు. ఆయన ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని లేఖలో కోరారు. ఒక మంత్రి బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకుంటే ప్రభుత్వం శక్తిని కోల్పోదు. అది ఇతర మంత్రులకు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుందనే స్పష్టమైన సందేశం వెళ్తుందని హజారే అభిప్రాయపడ్డారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని అన్నా హజారే ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు గౌరవం ఇవ్వాలని, సమస్యను శాంతియుత సంభాషణల ద్వారా పరిష్కరించాలని సూచించారు. 2024, 2026 సంవత్సరాల్లో నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు ప్రస్తావించిన హజారే, పరీక్ష రద్దు అనంతరం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలపై కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పరిగణించి, గాంధేయ సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏమిటీ నీట్ వివాదం..?
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటన అనంతరం సీజేపీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. వరుసగా వెలుగుచూస్తున్న పరీక్షల అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీకేజీల్లో ఒక్కదానికి కూడా శిక్ష అమలు చేయలేదని, వీటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, ప్రభావిత అభ్యర్థులకు నష్టపరిహారం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లను విద్యార్థులు ముందుకు తెచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా జూలై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేరి పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారిపై బాష్ప వాయువులు ప్రయోగించడం, లాఠీ ఛార్జ్ చేయడం, పలువురు విద్యార్ధులను అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా అగ్రహానికి కారణమైంది.
