అబ్బబ్బా… ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి..
ఎల్‌నినో తాకిడితో రుతుపవనం పడకేసిందనుకుంటే, అనుకోకుండా ఊడిపడ్డ వాయుగుండం జనానికి వానగండంగా మారింది. సరిపడా వానలు పడ్డా.. గుండె నిండా కష్టాన్ని కూడా మిగిల్చి వెళ్లింది. ఎల్‌నినో భయంతో వరి మానేసి ఆరుతడి పంటలు వేస్తే, ఆ చేలన్నీ రోజుల తరబడి వరద నీటిలోనే నానుతూ కుళ్లిపోతున్నాయి. రిజర్వాయర్లలో జలకళ ఉట్టిపడుతున్నా.. చేతికొచ్చిన పంటలు నీటిపాలై రైతన్న కళ్లల్లో మాత్రం కన్నీటి సుడులే తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ దాకా వాయుగుండం మిగిల్చిన నష్టం గురించి తెలుసుకుందాం..

కరుణించవయ్యా వరుణయ్యా అంటే.. కుంభవృష్టితో కుళ్లబొడిచాడు. రాకాసి చినుకుతో విరుచుకుపడ్డాడు. మొన్నటిదాకా అంతులేని అనావృష్టి.. ఇప్పుడు దిక్కుతోచని అతివృష్టి. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పడిపోయి, జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి, ఆయకట్టుకు నీళ్లు వదిలే దిక్కు లేక, ఎగువ రాష్ట్రాలను దేహీ అని అడుక్కోడానికి పరుగుపెడుతున్న టైమ్‌లో అతివృష్టి కురిసి, అన్నదాత ఆశలు కొంతలో కొంతయినా చిగురించాయి. ఎల్‌నినో భయాన్ని ఆ కాసేపైనా మర్చిపోయేలా చేసింది కుండపోత వాన. కానీ, తేరుకునేలోగా వాన కథ అడ్డం తిరిగింది. కురిసింది పిడికెడన్ని జిల్లాల్లోనే ఐనా అక్కడ కూడా కడగండ్లే మిగిలాయి. వాన పడిందన్న సంతోషం అంతా ఆవిరే అయ్యింది. వర్షాభావం ఎంత తగ్గిందన్న లెక్కల కంటే… జరిగిన పంట నష్టం ఎంతన్న లెక్కలే ప్రభుత్వాల్ని బెదరగొడుతున్నాయి. ఔను.. మనమీద వరుణుడి ప్రేమ… సాగరమే అయ్యింది. చినుకు ఉనికైనా లేనిచోట వాన ఉప్పెనై పొంగింది. నాలుగునెలలుగా వెంటాడిన వర్షాభావానికి ఇదిగో నా సమాధానం అంటూ కరువు తీరా కురిశాయి వానలు. కానీ, ఈ వానలతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నేల తడిసి, పైర్లు పులకరిస్తాయన్న కలలు కాస్తా కల్లలే అయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చితకేసింది వాన. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒక్క విశాఖపట్నంలోనే కేవలం 24 గంటల్లో 28 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే.. వాయుగుండం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. వందలాది ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయి, చెట్లు కూలి, రోడ్లు తెగిపోయి, రవాణా ఆగిపోయి.....
