AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: మా హీరోకు క్షమాభిక్ష ప్రసాదించండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన హీరో దర్శన్ అభిమానులు

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఏడాది గా జైల్లో ఉన్నాడు ప్రముఖ కన్నడ నటుడు దర్శన్. నటుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉండడంతో అతనికి కనీసం బెయిల్ కూడా లభించడం లేదు. ఈ నేపథ్యంలో దర్శన్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును మానవతా దృక్పథంతో విచారించాలని కోరుతూ హీరో అభిమానులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

Darshan: మా హీరోకు క్షమాభిక్ష ప్రసాదించండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన హీరో దర్శన్ అభిమానులు
Darshan,draupadi Murmu
Basha Shek
|

Updated on: Sep 26, 2026 | 10:35 PM

Share

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తుగుదీప్‌ ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయనకు కనీసం బెయిల్ కూడా రావడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. ఈ మర్డర్ కేసులో ఆయన సుమారు ఏడాదిగా జైలులో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటోన్న ప్రదోష్ అప్రూవర్ గా మారడం దర్శన్ ను మరింత చిక్కుల్లో పడేసింది. ఈ తంతు జరుగుతుండగానే దర్శన్ అభిమానులు రాష్ట్రపతికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ అభిమాన నటుడి బెయిల్ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని, అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని అభిమానులు ఈ లేఖలో కోరారు. అయితే ఇది నిజంగా అభిమానులు రాసిందేనా? లేక పబ్లిసిటీ స్టంటో కచ్చితంగా తెలియడం లేదు. అయితే దర్శన్ కేసును మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతూ, దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆశ్రయించిన దర్శన్ అభిమానులు రాసిన లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

‘డి బాస్ ఫ్యాన్స్, కర్ణాటక’ అని సంతకం చేసి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాసిన ఈ లేఖలో.. ‘ ‘మేము మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో చూస్తున్నాము. మీరు పేదలు, గిరిజనులు, అణగారిన వారి పక్షాన నిలబడే తల్లి. మా కర్ణాటకకు గర్వకారణమైన నటుడు డి-బాస్ దర్శన్ గారు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. కన్నడనాడులోని కోట్లాది మంది అభిమానులకు ఆయన దేవుడితో సమానం. మాకు భారతదేశ చట్టం, న్యాయస్థానాలపై నూటికి నూరు శాతం నమ్మకం ఉంది. మేము చట్టాన్ని గౌరవిస్తాము. కానీ ఒక తల్లిగా, దయచేసి మా దర్శన్ గారి విషయాన్ని మానవతా దృక్పథంతో చూడండి. ఆయన ఆరోగ్యం, ఆయన కుటుంబం, ఆయనను నమ్మే కోట్లాది మంది అభిమానుల గురించి ఆలోచించండి. చట్ట ప్రకారం మాకు న్యాయం జరగాలి, కానీ వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా మీరు అన్ని విధాలా సహాయం అందించాలని మేము కోరుతున్నాం. మేడమ్, మేము మీ దయగల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని కన్నడలో రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అరెస్టు అయినప్పటి నుండి దర్శన్ హైకోర్టుతో సహా పలు కోర్టులలో పదేపదే ఎదురుదెబ్బలు తిన్నాడు. అతను జైలులో నడుము నొప్పితో బాధపడుతున్నాడని, అతనికి సరైన చికిత్స అవసరమని అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ కూడా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us