JEE Advanced 2026: తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలు ఇవే.. ఫుల్ లిస్ట్ ఇదిగో!
2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్..

హైదరాబాద్, జనవరి 9: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు భారీగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 24 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ప్రకటన విడుదల చేసింది.
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దేశ వ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంటుంది. జేఈఈ మెయిన్ రెండు విడతల్లో తొలి 2.50 లక్షల ర్యాంకులు సాధించిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఈ ఏడాదికి మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్-2026ను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 725 చోట్ల ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఈసారి పరీక్ష కేంద్రాలను 717కు తగ్గించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు దరఖాస్తులో మొత్తం 10 వరకు ఎగ్జాం సెంటర్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. ర్యాంకుల వివరాలను విద్యార్థుల ఫోన్లకు నేరుగా పంపిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.. తెలంగాణలో ఈ 13 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ.. మొత్తం 24 నగరాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో మొత్తం 18,160 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




