కేంద్రం షాకింగ్ నిర్ణయం.. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ నిర్వహణకు ఎయిర్‌ఫోర్స్ సేవలు?
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్ర లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దైన పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్న ఈ రీ-ఎగ్జామ్ నిర్వహణలో లాజిస్టిక్స్, ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణా కోసం సైన్యం సహాయాన్ని తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది..

హైదరాబాద్, మే 29: ప్రశ్నాపత్ర లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో భారత సాయుధ దళాల సహాయాన్ని తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్‌టీఏ (NTA) ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రశ్నాపత్రాల తయారీ నుంచి ముద్రణ, రవాణా, భద్రతా ఏర్పాట్లు, చివరి దశ పంపిణీ వరకు మొత్తం పరీక్ష నిర్వహణ ప్రక్రియను సమీక్షించారు.
ఎన్‌టీఏకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అతిపెద్ద ఆఫ్‌లైన్ పరీక్ష నీట్-యూజీ. ఈ పరీక్షను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైతే సైన్యం సహాయాన్ని తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా వర్షాలు, తుఫానులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాల రవాణాకు వైమానిక దళం సహకారం ఉపయోగపడుతుందని అన్నారు. అయితే సైన్యం పాత్ర కేవలం లాజిస్టిక్స్, భద్రతా రవాణా, అత్యవసర పరిస్థితుల నిర్వహణకే పరిమితమవుతుందని, పరీక్ష నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనదని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, పౌర విమానయాన శాఖ, విదేశాంగ శాఖలు కూడా రీ-ఎగ్జామ్ నిర్వహణలో సహకరిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో సైన్యం లాజిస్టిక్స్ పరంగా భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక నీట్-యూజీ 2026 అవకతవకల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




