School Holiday: విద్యార్ధులకు అలర్ట్.. ఆ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు!
తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి జాత. దీనిని పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. ఇది ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. జాతరలో కీలకమైన దేవరపెట్టెకు కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. ఈ సందర్భంగా సూర్యపేటలోని విద్యా సంస్థలన్నింటికీ సోమవారం సెలవు ప్రకటించారు..

గత నెలంతా సంక్రాంతి సెలవులతో గడచిపోయింది. ఇక ఈ నెల నుంచి రానున్న పరీక్షల కోసం విద్యార్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వచ్చే నెల ప్రారంభం నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో సెలవులు వచ్చినా వీరికి మాత్రం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో కూడా ఆదివారాలు, శనివారాలు తీసేస్తే పెద్దగా పండగలేమీ లేవు. అయితే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మాత్రం అన్ని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 17 (సోమవారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని దురాజ్ పల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ రోజు స్థానిక సెలవుగా ప్రకటించారు. అనంతరం మంగళవారం నుంచి యథావిథిగా పాఠశాలలు కొనసాగుతాయి.
మరోవైపు తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ పెద్దగట్టు జాతర మొత్తం 5 రోజులపాటు జరుగుతుంది. ఇది సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అతి పెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. ఈ జాతర యేటా నిర్వహిస్తారు.
ఇది దాదాపు 250 యేళ్ల నుంచి జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక పెద్దగట్టు జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. ఈ ఏడాది జాతరకు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




