AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెండ్‌ ఇంటికెళ్తే రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటేశారు.. కట్‌చేస్తే కోచింగ్‌ లేకుండానే సరిగ్గా 10ఏళ్లకి IAS అయ్యాడు

వారణాసిలో ఓ పేద కుటుంబం.. తండ్రి రిక్షా తొక్కుతూ జీవనం.. చిన్న గదిలో ఉంటూ చదువులు.. ట్యూషన్లు చెబుతూ సివిల్స్‌కు సిద్ధం.. చివరకు మొదటి ప్రయత్నంలోనే 46వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపిక. ఇది గోవింద్ జైస్వాల్ స్ఫూర్తిదాయక ప్రయాణం. కష్టాలు ఎన్ని ఎదురైనా పట్టుదలతో లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం సాధించవచ్చని ఆయన జీవితం చెబుతోంది..

ఫ్రెండ్‌ ఇంటికెళ్తే రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటేశారు.. కట్‌చేస్తే కోచింగ్‌ లేకుండానే సరిగ్గా 10ఏళ్లకి IAS అయ్యాడు
IAS Govind Jaiswal Success Story
Srilakshmi C
|

Updated on: Aug 27, 2026 | 4:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన గోవింద్ జైస్వాల్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. ఆయన తండ్రి రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవారు. ముగ్గురు కుమార్తెల తర్వాత గోవింద్ జన్మించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన తండ్రి తన పిల్లలను చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. గోవింద్ సోదరీమణులు కూడా చదువుకుని ఉద్యోగాలు సాధించారు. అయితే చిన్నతనంలో గోవింద్ చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచే విద్యార్థి కాదు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ రోజుల్లో సాధారణ విద్యార్థిగానే ఉండేవారు. గోవింద్ జీవితంలో ఓ సంఘటన కీలక మలుపుగా మారింది. ఒకసారి స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలు, కారు, పెద్ద ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. అయితే తన పేదరికాన్ని చూసిన స్నేహితుడి తల్లి అవమానకరంగా మాట్లాడి అక్కడి నుంచి పంపించిందని ఆయన తన అనుభవాల్లో పేర్కొన్నారు. ఆ సంఘటన గోవింద్‌లో పట్టుదలను పెంచింది. జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఆలోచన బలపడింది. తండ్రికి వయసు మీద పడుతున్న సమయంలో కుటుంబ బాధ్యతలను తాను కూడా మోయాలంటే మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు.

జేబులో రూ.5 వేలతో ఢిల్లీ ప్రయాణం

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన గోవింద్.. దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటైన సివిల్స్‌ వైపు దృష్టి సారించారు. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? ఏ పుస్తకాలు చదవాలి? ఎలాంటి వ్యూహం పాటించాలి? వంటి విషయాలను తెలుసుకునేందుకు కోచింగ్‌ సెంటర్ల వద్దకు వెళ్లి అక్కడి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించేవారు. ఇదే సమయంలో ఆయన తండ్రికి కాలికి గాయం కావడంతో రిక్షా తొక్కడం కష్టమైంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ గోవింద్ తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు.

సివిల్స్‌ సాధించాలంటే ఢిల్లీలో ఉండి సిద్ధమవ్వాలని స్నేహితులు సూచించడంతో గోవింద్ కేవలం రూ.5 వేలతో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సాధారణ హాస్టల్‌లో ఉంటూ తన ప్రిపరేషన్‌ను ప్రారంభించారు. గణితంపై తనకు ఉన్న పట్టును ఉపయోగించుకుని ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులకు పాఠాలు చెప్పి, మిగిలిన సమయాన్ని సివిల్స్‌ చదువుకు కేటాయించేవారు. ఇంగ్లిష్‌పై పెద్దగా పట్టు లేకపోవడంతో గోవింద్ హిందీ మాధ్యమంలోనే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమయ్యారు. ఖరీదైన కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించే స్థోమత లేకపోవడంతో సాధారణ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి, ప్రముఖ సంస్థల స్టడీ మెటీరియల్‌ను జిరాక్స్‌ చేయించుకుని చదివేవారు. రోజుకు దాదాపు 12 గంటలు చదువుతూ, ట్యూషన్లు చెప్పడం, చదువుకోవడం అనే రెండు విషయాలపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు, భాషా సమస్య, అవమానాలు.. ఏవీ ఆయన లక్ష్యాన్ని దూరం చేయలేకపోయాయి.

ఇవి కూడా చదవండి

మొదటి ప్రయత్నంలోనే 46వ ర్యాంక్

గోవింద్ కష్టానికి ఫలితం దక్కింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 46వ ర్యాంక్ సాధించారు. అది కూడా హిందీ మాధ్యమంలోనే కావడం విశేషం. కొడుకు సివిల్స్‌లో 46వ ర్యాంక్ సాధించాడని తండ్రికి చెప్పినప్పుడు.. దాని గొప్పతనం ఏమిటో ఆయనకు పూర్తిగా తెలియక సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనుకున్నారని గోవింద్‌ తన అనుభవాల్లో చెప్పారు. తన కొడుకు చదువు కోసం తండ్రి ఎంతో త్యాగం చేశారు. రిక్షా తొక్కుతూ సంపాదించిన డబ్బుతో పాటు ఉన్న ఆస్తిని కూడా అమ్మి కొడుకు చదువుకు సహకరించారు. సోదరీమణులు కూడా గోవింద్‌ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో గోవింద్ సాధారణ దుస్తులతో, సాధారణ చెప్పులతో కనిపించేవారు. టీ స్టాళ్లు, హోటళ్ల వద్ద పేపర్‌ చదువుతూ ఉండేవారు. ఆయన పరిస్థితిని చూసి కొందరు చిన్నచూపు చూసినా.. గోవింద్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు సాగారు. ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో రెండు, మూడు తెల్ల చొక్కాలతోనే కాలం గడిపేవారని ఆయన గురించి చెప్పే కథనాల్లో ప్రస్తావిస్తారు. కానీ దుస్తులు తన లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించారు.

కష్టాలే విజయానికి మెట్లు.. కసితో ప్రయత్నం కొనసాగించాలి

గోవింద్ జైస్వాల్ కథలో ముఖ్యమైన విషయం ఒక్కటే—పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు.. మన పట్టుదల, కృషి నిర్ణయిస్తాయి. తాను సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఎదురైన అవమానాలను పట్టించుకోకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. ఆర్థిక సమస్యలు, ఇంగ్లిష్‌ భాషపై పట్టు లేకపోవడం, ఖరీదైన కోచింగ్‌ తీసుకునే అవకాశం లేకపోవడం వంటి సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించారు. మొదటి ప్రయత్నంలోనే 46వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపికై తన కుటుంబానికే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. గోవింద్‌ జైస్వాల్‌ విజయగాథ నుంచి యువత నేర్చుకోవాల్సిన విషయం స్పష్టంగా ఉంది. లక్ష్యం పెట్టుకోవడం మాత్రమే కాదు.. దాన్ని సాధించే వరకు కసితో ప్రయత్నం కొనసాగించాలి.

ఒకప్పుడు రిక్షా కార్మికుడి కుమారుడిగా పేదరికంలో పెరిగిన వ్యక్తి.. నేడు ఐఏఎస్‌ అధికారిగా ఎదగడం సాధారణ విషయం కాదు. తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను విజయంగా మార్చుకున్న గోవింద్‌ ప్రయాణం.. ఆర్థిక పరిస్థితులు, భాష, అవమానాలు, సౌకర్యాల కొరత ఏదీ ప్రతిభకు శాశ్వత అడ్డంకి కాదని నిరూపిస్తుంది. ఈరోజు మన పరిస్థితిని చూసి ఇతరులు మనల్ని అంచనా వేయవచ్చు. కానీ మన గమ్యం వైపు మనమే చూడాలి అనే సందేశాన్ని గోవింద్‌ జైస్వాల్‌ జీవితం అందిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదనే దానికి ఆయన విజయగాథ ఒక గొప్ప ఉదాహరణ.

Follow Us