CBSE Board Result 2025 Date: సీబీఎస్‌ఈ 10, 12 ఫలితాలపై బోర్డు క్లారిటీ.. ఇంతకీ ఎప్పుడంటే?
దేశ వ్యాప్తంగా దాదాపు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా సీబీఎస్‌ఈ బోర్డు 10, 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షలు నిర్వహించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఫలితాలు ఇంకా వెల్లడికాకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి..

హైదరాబాద్, మే 5: సీబీఎస్‌ఈ బోర్డు 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా దాదాపు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పరీక్షలు నిర్వహించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఫలితాలు ఇంకా వెల్లడికాకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ్య పూర్వకంగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. మే 6న ఉదయం 11 గంటలకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పలు సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
బోర్డు పేరిట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ లేఖ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ బోర్డు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. మంగళవారం సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తల్ని షేర్ చేయవద్దని, సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థులను కోరింది. కాగా గతేడాది మే 13వ తేదీన బోర్డు ఫలితాలను వెల్లడించింది. దీంతో మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే సీబీఎస్సీ బోర్డు ఫలితాలు మే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ఇతర అవాస్తవ వార్తలను నమ్మొద్దని బోర్డు తేల్చి చెప్పింది.
కాగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసారి దేశ్యాప్తంగా 7,842 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే మరో 26 దేశాల్లోనూ ఈ పరీక్షలను నిర్వహించారు. వీరిలో 24.12 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 17.88 లక్షల మంది విద్యార్ధులు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








