AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ

నీట్-యూజీ (NEET-UG) 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన 13 మంది నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను, పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టు ముందు బుధవారం ప్రవేశపెట్టనున్నారు..

NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ
CBI Files Charge Sheet in NEET UG Paper Leak Case
Srilakshmi C
|

Updated on: Jul 29, 2026 | 3:42 PM

Share

హైదరాబాద్, జులై 29: నీట్ పేపర్ లీక్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభం ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్, డాక్టర్ మనోజ్ షిరూరే, శివరాజ్ రఘునాథ్ మోతేగావ్‌కర్, మనీషా మంధర్‌వాల్, మనీషా సంధర్‌వాల్.. మొత్తం 13 మంది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ చార్జ్‌షీట్‌లో నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాధారాల ధ్వంసం, అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act), అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ (అన్‌ఫెయిర్ మీన్స్ నిరోధక) చట్టంలోని వివిధ నిబంధనల కింద అభియోగాలు నమోదు చేశారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో మొత్తం 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక భౌతిక ఆధారాలను ప్రస్తావించింది. కేసు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిందితుల పాత్రను వివరిస్తూ అభియోగపత్రాన్ని కోర్టులో సమర్పించింది.

మే 3న నీట్‌ పరీక్ష.. తర్వాత రద్దు!

2026 మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఉన్నత విద్యా శాఖ మే 12న ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం పరీక్షను రద్దు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం 72 మంది అధికారులు, సిబ్బందితో పాటు ఎనిమిది మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో సీబీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ డివైజ్‌లు, కీలక పత్రాలు తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా ప్రశ్నాపత్రం లీక్‌కు మూలం, అక్కడి నుంచి లబ్ధిదారుల వరకు మొత్తం గొలుసును గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసులో తొలి అరెస్టు 2026 మే 13న జరిగినట్లు సీబీఐ పేర్కొంది. అరెస్టైన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉన్నారు. వీరిలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ PV కులకర్ణి, బయాలజీ టీచర్‌ మనీషా గురునాథ్ మంధారే, ఫిజిక్స్ టీచర్‌ మనీషా సంజయ్ హవాల్దార్ ఉన్నారు.

అలాగే మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఆర్‌సీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని, ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావంకర్ కూడా ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పేపర్ లీక్ ప్రశ్నలను సేకరించి పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మధ్యవర్తులను కూడా సీబీఐ అరెస్టు చేసింది. పుణెలోని ఏపీఎంఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫిజిక్స్ అధ్యాపకుడు తేజస్ హర్షద్‌కుమార్ షా కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చేతిరాత నిపుణుల నివేదికలు, విద్యా నిపుణుల అభిప్రాయాల ఆధారంగా పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయి నిందితుల ద్వారా పంపిణీ చేయబడినట్లు నిర్ధారణ అయినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో మరింతలోతుగా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది. కాగా నీట్-యూజీ పరీక్ష పత్రం లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. మెడికల్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) పేరిట విద్యార్ధుల ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఏకంగా 36 రోజుల పాటు ఆందోళన చేపట్టడంతో తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జులై 25న తన పదవికి రాజీనామా చేశారు.

Follow Us