AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల భర్తీ.. అతిత్వరలోనే..

ఏపీఎస్‌ఆర్టీసీలో కొలువుల జాతరకు తెరలేవనుంది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 7,673 పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అసలు ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? తెలుసుకుందాం..

Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల భర్తీ.. అతిత్వరలోనే..
Apsrtc Recruitment 2026
Krishna S
|

Updated on: Jan 27, 2026 | 8:08 PM

Share

ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో మెగా డీఎస్సీతో పాటు పలు ఉద్యోగ నోటిఫికేషన్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. అవును..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు, సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి శుభవార్త అందించింది. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ స్థాయిలో రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది.

ఖాళీగా ఉన్న 7,673 పోస్టుల భర్తీ

ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డ్రైవర్లు 3,673 పోస్టులు, కండక్టర్లు 1,813 పోస్టులతో పాటు డిపోల్లో ఖాళీగా ఉన్న మెకానిక్‌లు, శ్రామిక్‌లు, ఇతర సాంకేతిక పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే ఈ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల సంస్థలో పనిభారం తగ్గడమే కాకుండా, రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని బోర్డు భావిస్తోంది.

ఆన్‌కాల్ డ్రైవర్లు, కండక్టర్లకు వేతనాల పెంపు

ఉద్యోగాల భర్తీతో పాటు ప్రస్తుతం సేవలందిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌కాల్ డ్రైవర్లకు రోజువారీ వేతనాన్ని రూ.800 నుండి రూ.1000 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదనపు విధులు నిర్వహించే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ. 900కు పెంచారు.

స్త్రీ శక్తి పథకానికి ఊతం

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. బస్సుల సంఖ్య పెంచడం, సిబ్బంది కొరత తీర్చడం ద్వారా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే సంస్థ ప్రధాన లక్ష్యం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.