Andhra Pradesh: ప్రభుత్వ ఉపాధ్యాయుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న జగన్ సర్కార్ తాజా నిర్ణయం.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
8వ తరగతి వరకు నో తెలుగు మీడియం..విద్యార్థుల సంఖ్య తగ్గితే పోస్టుకు గండమే! 138 మందికి మించి విద్యార్థులు ఉంటేనే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు.. ఇంకా..
AP Govt School Teachers Rationalization Orders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని, ఈ మార్గంలోనే కొత్త సంస్కరణలను తీసుకొచ్చినట్లు తెల్పింది. దీనిలో భాగంగానే సబ్జెక్టుల వారీగా బోధనకు ఉపాధ్యాయులను నియమిస్తున్నామని వివరించింది. టీచర్ల యూనియన్లు, విద్యానిపుణులతో చర్చించాకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెల్పింది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే చోట ప్రధాన ఉపాధ్యాయులు ఉండకుండా పూర్తిగా తీసివేస్తున్నారు. వీరి స్థానంలో సీనియర్ ఉపాధ్యాయుడు హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవడం దీని ఉద్ధేశ్యమని చెబుతున్నప్పటికీ..ఉపాధ్యాయులు ఒకరు, ఇద్దరు సెలవు పెడితే తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుంది. ఇది ఉపాధ్యాయులపై పని భారం పెంచుతుందని చెప్పవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం శుక్రవారం (జూన్ 10) ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ సంస్కరణలు ఇవే..
- 3 నుంచి10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో 137 మంది, 6 నుంచి10 తరగతుల బడిలో 92 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులు ఉండవు.
- 17 సెక్షన్ల విద్యార్థులకు ఒక్క హిందీ ఉపాధ్యాయుడు మాత్రమే పాఠాలు బోధించాల్సి ఉంటుంది. 19 సెక్షన్లకు మూడు మ్యాథమెటిక్స్, సోషల్ పోస్టులిచ్చింది. దీంతో వారానికి ప్రతి ఉపాధ్యాయుడు 48 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది.
- 6 నుంచి 10 తరగతుల్లో 18 సెక్షన్లకు 21 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
- 3 నుంచి 8 తరగతులకు అసలు ప్రధానోపాధ్యాయుడి పోస్టునే కేటాయించలేదు.
- రాష్ట్రంలో ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉండే ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్‌ను నియమించనున్నారు.
- విద్యార్థుల సంఖ్య 31కి చేరితే రెండో ఎస్జీటీని ఇస్తారు. రాష్ట్రంలో ఎక్కువగా 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలే అధికంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ బడులుగా మారతాయి.
- 121 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు.
- 10 మందిలోపు విద్యార్థులు ఉంటే కమిషనర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. హేతుబద్ధీకరణలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే అవసరమైన పాఠశాలకు మార్పు చేస్తారు. ఒకవేళ ఆ పాఠశాలలో ఖాళీ పోస్టు ఉంటే దానిని మాత్రమే మరో పాఠశాలకు మార్చుతారు.
- పోస్టు లేని సమయంలో ఉపాధ్యాయుల్లో జూనియర్ కొత్త పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల్లోనే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు అమలు చేయాలని, మిగతా అన్ని తరగతుల్లోనూ ఒకే మాధ్యమం నిర్వహణ. ఈ లెక్కన 8వ తరగతి వరకు ఒక్క ఆంగ్ల మాధ్యమమే ఉంటుంది. తెలుగు మాధ్యమం లేనట్లే..
- 3 నుంచి 8 తరగతులు ఉండే ప్రీ హైస్కూల్‌లో 195 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండి, దీనికి మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ లేకపోతే దీన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు.
- 98 మంది కంటే తక్కువ ఉంటే 30 మందికి ఒకటి చొప్పున ఎస్జీటీలను ఇస్తారు. ఏడో తరగతి వరకు ప్రీ హైస్కూల్‌ను 8వ తరగతి వరకు ఉన్నతీకరిస్తారు.
- హైస్కూళ్లల్లో (3 నుంచి10 తరగతులు) సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తారు. 138 మందికి మించి విద్యార్థులు ఉంటేనే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు ఇస్తారు.
- 275 మంది బాలికలు ఉన్న పాఠశాలలో మ్యూజిక్, డ్రాయింగ్, కుట్టుమిషన్ శిక్షణకు ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటు చేస్తారు.
- ఒకే ప్రాంగణంలో ఉండే 1-10 తరగతులకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు.
- 6-10తరగతులు ఉన్న హైస్కూల్‌లో 93 మందికిపైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టు ఇస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.