AP DSC New Exam Pattern: నిరుద్యోగులకు అలర్ట్.. డీఎస్సీ నియామక పరీక్ష విధానంలో కీలక మార్పులు?
AP DSC recruitment exam pattern will be changed: ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలోనే పాఠ్యాంశాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమమే అమలవుతున్నందున విద్యాశాఖ డీఎస్సీ నియామకాల్లో కీలక మార్పు తీసుకువచ్చింది. ఇక నుంచి నిర్వహించే డీఎస్సీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతోపాటు..

అమరావతి, అక్టోబర్ 17: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలోనే పాఠ్యాంశాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమమే అమలవుతున్నందున విద్యాశాఖ డీఎస్సీ నియామకాల్లో కీలక మార్పు తీసుకువచ్చింది. ఇక నుంచి నిర్వహించే డీఎస్సీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కూడా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు, పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోంది. అయితే దీనిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
నిజానికి, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో పిల్ సైతం దాఖలైంది. ఇప్పటి వరకు కేవలం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ల(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే డీఎస్సీ నియామకాల్లో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇకపై అన్ని పరీక్షల్లో అంటే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు కూడా ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలపై విచారణ వాయిదా
తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు నవంబరు 18వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మోడరేషన్ పద్ధతిలో గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల పునర్మూల్యాంకనం చేపట్టి, అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటు మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పిటిషనర్లు రాతపూర్వక వాదనలు దాఖలు చేయకపోవంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో సింగిల్ జడ్జి తీర్పు అమలుపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




