AP EAPCET 2025 Inter Weightage: ఈఏపీసెట్‌లో ర్యాంకులు కేటాయించని వారికి జూన్ 15 గడువు..! ఆలోగా ఏం చేయాలంటే..
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌లో ఏకంగా 15 వేలకుపైగా విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి ర్యాంకులు ప్రకటించలేదు. అర్హత సాధించినప్పటికీ ఈ 15 వేల మంది అభ్యర్థుల ర్యాంకులను వివిధ కారణాలతో ప్రకటించలేదు. వీరికి కన్వీనర్ మరో ఛాన్స్ ఇచ్చారు. అదేంటంటే..

అమరావతి, జూన్ 13: ఏపీ ఇటీవల ఈఏపీసెట్-2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌లో ఏకంగా 15 వేలకుపైగా విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి ర్యాంకులు ప్రకటించలేదు. అర్హత సాధించినప్పటికీ ఈ 15 వేల మంది అభ్యర్థుల ర్యాంకులను వివిధ కారణాలతో ప్రకటించలేదు. వీరికి ఇంటర్మీడియట్ మార్కులు అందుబాటులో లేకపోవడం వల్లే ర్యాంకులు కేటాయించలేదని అధికారులు తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళనకు గురికావొద్దని ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు భరోసా ఇచ్చారు.
వారంతా 10+2లో సాధించిన మార్కులను ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల అభ్యర్థులు తమ ఇంటర్ మార్కులను జూన్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, వెయిటేజీ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని జూన్ 11న ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 2025లో ఇంటర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రెగ్యులర్ విద్యార్థుల్లో ర్యాంకులు రానివారంతా ఇంటర్ మార్కులను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులో ఇంటర్ హాల్‌టికెట్ నంబర్లను సరిచూసుకొని కాకినాడలోని జేఎన్‌టీయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో వ్యక్తిగతంగా లేదా ఫోన్, మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని కోరారు.
అలాగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా మార్కులను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వారి మార్కులను ఆయా బోర్డుల నుంచి నేరుగా తీసుకుంటామని, హాల్ టికెట్ల నంబర్లను ఇస్తే సరిపోతుందని అన్నారు. వీరందరికీ త్వరలోనే ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. ఇక రెగ్యులర్ ఇంటర్‌విద్యార్థులు కాకుండా ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్, ఎన్‌ఐఓఎస్, డిప్లమా, ఇతర బోర్డులకు చెందిన ఇంటర్ విద్యార్థులు తమ మార్కులను ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు వస్తే 0884-2359599, 0884-2342499 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. అలాగే helpdeskapeapcet@apsche.org మెయిల్ ఐడీ ద్వారా కూడా తెలపవచ్చని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.