10th Class Social Exam 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. సోషల్ పరీక్ష వాయిదా! కొత్త తేదీ ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. చివరి పరీక్ష అయిన సోషల్ స్టడీస్ పేపర్‌ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 28) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు విద్యార్థులతోపాటు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి..

అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవగా.. రాష్ట్ర వ్యా్ప్తంగా మొత్తం 6,19,275 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అయితే ముందే ఊహించినట్లు చివరి పరీక్ష అయిన పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. మర్చి 31వ తేదీన రంజాన్ పండగరావడంతో ప్రభుత్వం ఈ మేరకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీన జరగవల్సిన సోషల్ స్టడీస్ పేపర్ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు పరీక్ష తేదీలో మార్పులు చోటు చేసుకున్న విషయాన్ని విద్యార్థులతోపాటు హెచ్ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖతో పాటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాలకు తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. మెటీరియల్, ప్రశ్నపత్రాలు తీసుకునేందుకు మార్చి 31న నిల్వ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని సూచించింది.
ఏప్రిల్ 3 నుంచి టెన్త్ మూల్యాంకనం
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాల పర్యవేక్షణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఆటంకం జరగకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పరీక్షలు ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానుంది. మూల్యాంకనం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఏడు రోజులపాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఆయా రోజుల్లో రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తారు. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు. మూల్యాంకనం పూర్తయిన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన జవాబు పత్రాల్లో కనీసం రెండు జవాబు పత్రాల చొప్పున పరిశీలించాల్సి ఉంటుంది. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 జవాబు పత్రాలు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 45 చొప్పున మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. ఈ క్రమంలో మార్కుల్లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు అదేశించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.