AP SSC Result 2024 Date: పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఇదే.. కొనసాగుతోన్న మూల్యాంకన ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 8వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ..
అమరావతి, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 8వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ పూర్తవనుంది. అనంతరం రీవెరిఫికేషన్ చేసి, మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఫలితాలను ఏప్రిల్ నాలుగో వారంలో లేదంటే మే మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందే పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
అటు తెలంగాణలోనూ ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. పరీక్షలు పూర్తైన మరుసటి రోజు నుంచే అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ రెండో వారంలోగా మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనంతరం ఫలితాల ప్రాసెసింగ్ వేగవంతం చేసి మే మొదటి వారం నాటికి టెన్త్ ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది దాదాపు 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రారంభమవటంతో తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి, తెలంగాణలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వేసవి సెలవులు ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగించేలా ఈసీలు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.