AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2025 Application: సర్కార్ బడి టీచర్లకు ‘టెట్‌’ టెన్షన్.. ఆ రివ్యూ పిటిషన్‌పైనే కోటి ఆశలు!

AP Teacher Eligibility Test 2025: టెట్‌ లేని వారంతా రెండేళ్లలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల టీచర్లందరూ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనంటూ వచ్చిన ఈ తీర్పుతో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కూటమి సర్కార్ టెట్‌–2025(అక్టోబర్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది కూడా.

AP TET 2025 Application: సర్కార్ బడి టీచర్లకు 'టెట్‌' టెన్షన్.. ఆ రివ్యూ పిటిషన్‌పైనే కోటి ఆశలు!
Andhra Pradesh Teacher Eligibility Test
Srilakshmi C
|

Updated on: Nov 03, 2025 | 8:45 AM

Share

అమరావతి, నవంబర్‌ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సర్కార్ బడి టీచర్లకు సుప్రీంకోర్టు పెద్ద పరీక్ష పెట్టింది. టెట్‌ లేని వారంతా రెండేళ్లలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాల టీచర్లందరూ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనంటూ వచ్చిన ఈ తీర్పుతో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కూటమి సర్కార్ టెట్‌–2025(అక్టోబర్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది కూడా. అయితే ఈ పరీక్ష రాయాలా? వద్దా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. టెట్‌ పరీక్ష తీరుతెన్నులు, మార్కుల విధానం, నిబంధనలు అన్నీ చూసి సర్వీసులో ఉన్న టీచర్లు నోరెళ్లబెడుతున్నారు. మరోవైపు టెట్‌ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్లీ టెట్‌ మినహాయింపుపై టీచర్లలో ఆశలు చిగురించాయి. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్‌’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

రాష్ట్రంలోని ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.8 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరంతా రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీరిలో పీఈటీ, పీడీలకు టెట్‌ అవసరం లేదు. 2011కు ముందు డీఎస్సీలో నియామకమైన మిగతా టీచర్లంతా టెట్‌ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మాత్రం టెట్ మినహాయింపు ఇచ్చారు. అయితే వీరు పదోన్నతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఒక్క ఏపీకి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్నిరాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుంది.

దీంతో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు సుప్రీంతీర్పుపై అప్పీల్‌కు వెళుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ టీచర్లకు అనుమతిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీంతో ఉపాధ్యా­యులు ఈ పరీక్ష రాయాలా? వద్దా? అనే గందరగోళంలో పడిపోయారు. ఇక మరికొందరు మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా టెట్‌ రాసేందుకు సిద్ధమై దరఖాస్తులు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 53,560 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 18,982 మంది పురుషులు, 34,578 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 5,916 మంది టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా డిసెంబరు 10న జరిగే టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తం 150 మార్కులకు జరిగే టెట్‌ పరీక్షలో ఓసీలు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ అభ్యర్ధులకు 60 మార్కుల చొప్పున సాధిస్తేనే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.