Andhra Pradesh: నిరుద్యోగ యువత కోసం ‘ట్రెయిన్ అండ్ హైర్’ ప్రోగ్రామ్.. ఉచితంగా శిక్షణతోపాటు ఉద్యోగం కూడా!
నిరుద్యోగ యువతకు కూటమి సర్కార్ వినూత్న ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. ఉచితం శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కూడా కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ప్రారంభంకాగా.. మరికొన్ని చోట్ల అవసరం మేరకు యూనివర్సిటీలు, కాలేజీల నుంచి స్థలాలను సేకరించే పనిలో పడింది..
అమరావతి, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితవ్యం కోసం విశేషంగా కృషి చేస్తుంది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించేందుకు ‘ట్రెయిన్ అండ్ హైర్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థలే యువతకు శిక్షణ ఇచ్చి, ఆయా సంస్థల్లో, అనుబంధ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తాయి. శిక్షణ పూర్తిగా ఉచితంగానే అందిస్తాయి. అభ్యర్థుల నుంచి ఎటువంటి రుసుమూ వసూలు చేయరు.
దీనిలో భాగంగా యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఆయా సంస్థలకు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో కొంత స్థలం కేటాయించడం, వారికి అవసరమైన అర్హతలు కలిగిన యువతను అందించడంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకరిస్తుంది. ఇక ఇప్పటికే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్థలం సేకరించారు. ఇదే మాదిరి మిగతా యూనివర్సిటీలతోనూ సంప్రదింపులు జరిపి, స్థలాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో టెక్ వర్క్స్ సంస్థ 30 మందికి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు విజయవాడ ఐటీఐ క్యాంపస్‌లో కూడా రెవిలేషనరీ సంస్థ 30 మందికి శిక్షణ ఇస్తోంది. సంస్థలు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ ఏపీ సర్కార్ శిక్షణకు స్థలం కేటాయిస్తుంది.
వచ్చే నెలలోనే నవోదయ ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్ టికెట్లు
దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ వచ్చే ఏడాది జనవరి 18వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అడ్మిట్‌కార్డులు కూడా విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి నెలలో వెల్లడి చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 చొప్పున నవోదయ (జేఎన్‌వీ) విద్యాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎంపికైతే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అందిస్తారు. బాలబాలికలకు ఉచితంగా విద్యా, వసతి సౌకర్యాలు కల్పించారు.