AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్షలు ఎప్పటినుంచంటే..
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మెగా డీఎస్సీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు వేగంగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించగా.. మొత్తం 3లక్షల 35 వేల 401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇక చివరి పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు. కీ పై అభ్యంతరాలు స్వీకరించడానికి 7 రోజుల సమయం ఇస్తారు. అభ్యంతరాలు పూర్తైన రోజు నుంచి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లో డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు.
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. అయితే అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు అధికారులు.
డీఎస్సీ అభ్యర్థులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. WhatsApp సర్వీస్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. డీఎస్సీ నిర్వహణ పట్ల తమ నిబద్ధత నెరవేరింది.. ఇప్పుడు మీ వంతు వచ్చిందన్నారు. పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని లోకేశ్ ఆకాంక్షించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
