JEE Advanced 2025 Results: మరికొన్ని గంటల్లోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే! మర్నాడే జోసా..
ఈ ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు సోమవారం (జూన్ 2) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 1.80 లక్షల మంది ఈ పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జేఈఈ రెండు విడతల్లో..

హైదరాబాద్, జూన్ 1: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు సోమవారం (జూన్ 2) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 1.80 లక్షల మంది ఈ పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జేఈఈ రెండు విడతల్లో కలిపి తొలి 2.5 లక్షల ర్యాంకర్లకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. అయితే యేటా ఈ పరీక్ష రాసే విద్యార్ధులు కనీసం 2 లక్షలు కూడా చేరడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సుమారు 40 వేల మంది హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీల్లో సీట్లు కల్పిస్తారు.
కాగా గత ఏడాది అడ్వాన్స్‌డ్‌లో అన్ని రిజర్వేషన్ల కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి మాత్రమే జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. అంటే వీరు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులన్నమాట. 2024-25 గత విద్యాసంవత్సరంలో 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యాసంవత్సరం (2025-26) ఐఐటీల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఇందులో 80 సీట్లను అదనంగా అందుబాటులోకి తీసుకురానుంది.
ఐఐటీ బాంబే కూడా నాలుగేళ్ల బీఎస్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ అనే మరో కోర్సును ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఎన్ని సీట్లు ఉంటాయన్నది ఇంకా వెల్లడించలేదు. ఇక మరికొన్ని ఐఐటీల్లో కూడా ఈసారి సీట్లు సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతొ ఈసారి అర్హుల సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు సోమవారం ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆ మరుసటి రోజే అంటే జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐఐటీ కాన్పుర్ ఇప్పటికే షెడ్యూల్ కూడా జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




