Diwali వరకు ఆగితే పసిడి ధరలు తగ్గుతాయా? మార్కెట్ నిపుణుల అంచనా ఇదే..!
బంగారం ధరలు 10 గ్రాములకు 1.10 లక్షలకు చేరుకున్నాయి, ఇది దీపావళి పండుగ సీజన్‌లో చారిత్రాత్మక గరిష్ట స్థాయి. ప్రపంచ మార్కెట్‌లోని పెరుగుదల, అమెరికా డాలర్ విలువ పెరగడం, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో ఈ పెరుగుదల సంభవించింది. ఈ ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

బంగారం ధరలు తగ్గడం అనే మాట మర్చిపోయినట్టు ఉన్నాయి. గత కొంత కాలంగా అలా పెరుగుతూనే పోతున్నాయి. తాజా మంగళవారం మరోసారి పెరిగిన బంగారం ధర.. 10 గ్రాములకు ఏకంగా రూ. 1.10 లక్షలను తాకింది. పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఇది చారిత్రాత్మక గరిష్ట స్థాయిని సూచిస్తుంది. అయితే ఈ పెరుగుదల ప్రపంచ మార్కెట్ ధోరణులకు అనుగుణంగా ఉంది. వరల్డ్ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు రికార్డు స్థాయిలో 3,475 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి కూడా ఔన్సుకు 40 డాలర్లకు పెరిగింది.
ఇక దీపావళి, ధంతేరస్, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో బంగారం ధరపై సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అంతా ఆందోళన చెందుతున్నారు. సాంప్రదాయాల ప్రకారం మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. దీపావళి సందర్భంగా కూడా కొంతమంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న రేటు చూసి అంతా భయపడుతున్నారు. మరి దీపావళి వరకు అయినా బంగారం ధర తగ్గుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ దీపావళి నాటికి కూడా బంగారం ధర పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దీపావళి అంటే సాంప్రదాయకంగా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేస్తాయి. కానీ ఈ ధరల వద్ద చాలామంది ఆలస్యం చేయవచ్చు లేదా తగ్గించవచ్చు అని న్యూఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లోని ఒక ఆభరణాల వ్యాపారి అన్నారు.
అమెరికా డాలర్, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, సురక్షిత ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి సంవత్సరానికి 35 నుండి 45 శాతం లాభాలను నమోదు చేశాయి. అయినప్పటికీ కొనుగోలు విధానాలు మారినప్పటికీ, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత బంగారం డిమాండ్‌ను సజీవంగా ఉంచుతుందని పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




