AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saving Plans: లోన్ ఉచ్చులను నివారించండి.. సేవింగ్స్‌ ప్లాన్స్‌ను ప్రారంభించండి

సరిగ్గా ప్లాన్ చేసుకుని బడ్జెట్‌ను ప్రారంభించి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఒక దృఢమైన ప్లానింగ్‌తో.. ప్రతి రూపాయిని విచక్షణతో ఖర్చు చేస్తూ.. భవిష్యత్ కోసం స్పష్టమైన ప్లాన్ తో వ్యవహరించాల్సిన తరుణం ఇది. 30 ఏళ్ల వయసులో పెళ్లి దానితో పాటు అదనపు బాధ్యతలు వచ్చి పడతాయి. అందుకే స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది..

Saving Plans: లోన్ ఉచ్చులను నివారించండి.. సేవింగ్స్‌ ప్లాన్స్‌ను ప్రారంభించండి
Saving Plans
Subhash Goud
|

Updated on: Aug 31, 2023 | 9:02 PM

Share

ఒక్కసారి మంచి భోజనం చేస్తే.. ఆకలి తీరిపోతుంది. కడుపు నిండిన తరువాత అప్పుడు తిన్న వంటకాలు పెద్దగా ఇంట్రస్ట్ అనిపించదు. ఆకలి మీద ఉన్నపుడు ఎదో ఒక ఆహరం అయితే చాలు అనుకుంటాం.. కడుపు నిండిన తరువాత మంచి రుచి కరమైనదాని కోసం వెతుక్కుంటాం. ఎందుకంటే మన అవసరం తీరిపోయింది. అలాగే ఒక వయసు వచ్చేవరకూ మనం అవసరాలు.. కోరికల మధ్య తేడా తెలీదు. కష్టపడి చదువుకుని.. మంచి ఉద్యోగం సాధించి సంపాదించడం మొదలు పెట్టగానే.. అప్పటివరకూ ఉన్న అవసరాలు మర్చిపోతాం. కొత్త కోర్కెలు పుట్టుకు వస్తాయి. నిజంగా అవసరమైన దాని కన్నా కొత్తగా పుట్టుకొచ్చిన కోర్కెలను తీర్చుకోవడం కోసం పరుగులు తీస్తాం. అయితే, మన లైఫ్ స్టైల్ ను అవసరాలకు – కోరికలకు మధ్య ఉన్న తేడాను జాగ్రత్తగా గమనించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్ల వయసుకు వచ్చినపుడు ఫైనాన్షియల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇది సరిగ్గా ప్లాన్ చేసుకుని బడ్జెట్‌ను ప్రారంభించి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఒక దృఢమైన ప్లానింగ్‌తో.. ప్రతి రూపాయిని విచక్షణతో ఖర్చు చేస్తూ.. భవిష్యత్ కోసం స్పష్టమైన ప్లాన్ తో వ్యవహరించాల్సిన తరుణం ఇది. 30 ఏళ్ల వయసులో పెళ్లి దానితో పాటు అదనపు బాధ్యతలు వచ్చి పడతాయి. అందుకే స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 30 ఏళ్ల వయసులో ఎటువంటి ఆర్ధిక ప్రణాళికతో ముందుకు సాగాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

లోన్ ఉచ్చులను నివారించండి:

ఆకర్షణీయంగా కనిపించే క్రెడిట్ కార్డ్‌లు మన ఆర్ధిక ప్రణాలికను తల్లకిందులు చేసేస్తాయి. అసలు మనకి ఎక్కువ క్రెడిట్ కార్డులు అవసరమా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఎక్కువ క్రెడిట్ కార్డులు దగ్గర పెట్టుకుని.. ప్రచారాల మత్తులో పడిపోయి కార్డులు ఖాళీ చేసుకుని.. అప్పుల ఊబిలో జారిపోకండి. అవరం లేని వస్తువులు.. ఆకర్షణీయంగా కనిపించే జీవన శైలి వైపు వెళ్ళకుండా.. లోన్స్ ఉచ్చులో పడకుండా ఉండండి. ఈ వయసులో లోన్స్ ఉచ్చులో పడితే.. తరువాత మీ జీవితం మొత్తం తాకట్టులో పడిపోతుంది.

ఇవి కూడా చదవండి

ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి:

జీవితంలో ఏ సమయంలోనైనా పెట్టుబడి ప్రపంచాన్ని అన్వేషించడం ఎప్పుడూ మంచిది. ఈక్విటీలలో పెట్టుబడితో ప్రారంభించడం టేకాఫ్ చేయడానికి ఉత్తమ మార్గం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీరు నేరుగా స్టాక్స్ కొనుగోలు చేయాలా? లేకపోతె మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? అదీకాకపోతే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలా? అనేది మీ ఆర్ధిక స్థాయిని బట్టి.. మీ రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి అంచనా వేసుకోండి. మార్కెట్ రీసెర్చ్ చేయండి. అవసరం అనుకుంటే ఆర్ధిక సలహాదారులను సంప్రదించండి. మంచి వైవిధ్యభరితమైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియో సిద్ధం చేసుకోండి.

మంచి రిటైర్మెంట్ ప్లాన్:

ఇప్పుడే ఉద్యోగం వచ్చింది.. అప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ ఏమిటి? అని అనుకోకండి. మీరు రిటైర్ అయ్యేసరికి ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందో.. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఊహించలేరు. కానీ, కొంత డబ్బు అందుకోసం దాచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు చాలా రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ అవసరాలకు తగిన దానిని ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి.

ఇన్సూరెన్స్ తప్పనిసరి:

సాధారణంగా టాక్స్ తగ్గించుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేస్తుంటారు. కానీ.. మీ ఆరోగ్యం కోసం ఇన్సూర్ చేసుకున్నారా? తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కరి అనారోగ్యం ఒక్కోసారి కుటుంబం మొత్తాన్ని వీధుల పాలు చేస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించండి. అకస్మాత్తుగా వచ్చిపడే అనారోగ్య ఖర్చులను తప్పించుకొండి.

పార్టీ బడ్జెట్‌ను చేసుకోండి:

పుట్టినరోజులు.. పెళ్ళిరోజులు.. స్నేహితులు.. బంధువులు.. ఇలా సంవత్సరం పొడవునా ప్రతి నెలా ఎదో ఒక పార్టీ తప్పనిసరిగా ఎదురవుతూనే ఉంటుంది. మీ బడ్జెట్ లో అటువంటి పార్టీల కోసం ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోండి. ఆ బడ్జెట్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకండి. పార్టీల ఖర్చులు క్రెడిట్ కార్డులతో అప్పటికప్పుడు బాగానే మ్యానేజ్ చేయవచ్చు కానీ.. చిటికెలో చేసిన క్రెడిట్ కార్డు ఖర్చు.. భవిష్యత్ లో పెద్ద గుదిబండగా మారిపోవచ్చు అనే విషయం గుర్తు పెట్టుకోండి.

అదండీ విషయం.. ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడతామో.. రూపాయి కోసం ఎంత తిప్పలు పడతామో.. అది చేతికి వచ్చిన తరువాత దానిని జాగ్రత్త చేసుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. లేకపోతే కష్టకాలంలో డబ్బు కోసం చేయిచాపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే 30 ఏళ్ల వయసులో కోరికలకు పగ్గాలు వేసి మనం మన జీవిత సహచరులు సంతోషంగా గడిపే జీవితాన్ని ఇవ్వడానికి సరైన ఆర్ధిక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి