Loans: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఈఎంఐ ఎవరు కట్టాలి..? తప్పక తెలుసుకోండి..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయాడు.. మరి ఆ లోన్ ఎవరు కట్టాలి..? ఆ భారం కుటుంబంపై పడుతుందా? అసలు బ్యాంకు ఎవరిని అడుగుతుంది..? మీ ఇల్లు, కారు సేఫ్‌గా ఉంటాయా..? ఈ విషయంలో బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం నేటి కాలంలో సర్వసాధారణం. లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు అప్పు తీసుకునే వ్యక్తి ఆర్థిక చరిత్ర, ఆదాయం, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తాయి. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా చనిపోతే, ఆ లోన్ డబ్బు ఎవరు తిరిగి చెల్లించాలి? వడ్డీ భారం ఎవరిపై పడుతుంది? అనే ప్రశ్నలు చాలా మందిని కలవరపెడుతుంటాయి. ఈ విషయంలో బ్యాంకు నియమాలు, రికవరీ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.
లోన్ తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిది?
లోన్ తీసుకున్న మరణించినప్పుడు బ్యాంకు తీసుకునే చర్యలు, రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ విధంగా ఉంటుంది:
కో-అప్లికెంట్: బ్యాంకు ముందుగా కో అప్లికెంట్‌ను సంప్రదిస్తుంది. సాధారణంగా హోమ్ లోన్స్, విద్యా రుణాల దరఖాస్తులలో కో అప్లికెంట్ పేరు ఉంటుంది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా.. కో అప్లికెంట్ ఆ లోన్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
గ్యారెంటర్: కో అప్లికెంట్ కూడా లోన్ తిరిగి చెల్లించలేకపోతే.. బ్యాంకు గ్యారెంటర్‌ను సంప్రదిస్తుంది. గ్యారెంటర్ కూడా రుణాన్ని చెల్లించడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తారు.
చట్టపరమైన వారసులు: కో అప్లికెంట్ లేదా గ్యారెంటర్ లోన్ చెల్లించడానికి నిరాకరిస్తే.. బ్యాంకు మరణించిన వ్యక్తి యొక్క వారసులను సంప్రదిస్తుంది. ఇందులో భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యులు ఉంటారు. బ్యాంకు వారికి రుణం తిరిగి చెల్లించమని నోటీసులు, రిమైండర్‌లు పంపుతుంది.
బ్యాంకు ఎప్పుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది?
కో అప్లికెంట్, గ్యారెంటర్ లేదా చట్టపరమైన వారసులు ఎవరూ లోన్ తిరిగి చెల్లించడానికి ముందుకు రాకపోతే బ్యాంకు తుది చర్యగా మరణించిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తుంది.
హోమ్ లోన్స్: హోమ్ లోన్స్ విషయంలో ఆ ఇల్లు లేదా ఫ్లాట్ తాకట్టు పెట్టబడి ఉంటుంది కాబట్టి బ్యాంకు నేరుగా ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలంలో విక్రయించి లోన్ వసూల్ చేసుకుంటుంది.
వెహికల్ లోన్స్: వాహన రుణం ఉంటే బ్యాంకు వాహనాన్ని లాక్కొని, వేలం ద్వారా విక్రయిస్తుంది.
పర్సనల్ లోన్స్: సాధారణంగా పర్సనల్ లోన్లకు పూచీకత్తు ఉండదు కాబట్టి వారసులు కట్టడానికి ఒప్పుకోకపోతే బ్యాంకులు ఏమి చేయలేవు. దానిని నిరర్థక ఆస్తిగా ప్రకటించి, వదిలేస్తుంది. అయితే ఆస్తులు ఉంటే వాటిని అమ్మి వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇన్సూరెన్స్ ఉంటే ఏం జరుగుతుంది..?
లోన్ తీసుకునేటప్పుడే లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ అప్పు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే బ్యాంకుకు కట్టేస్తుంది. అప్పుడు కుటుంబంపై ఒక్క రూపాయి భారం కూడా పడదు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




