AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ రుణం మాఫీ అవుతుందా..? రూల్స్ ఏం చెప్తున్నాయి..!

రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక వ్యక్తి తన అవసరాల కోసం బ్యాంకులో లోన్ తీసుకుని, అది తీరకముందే ఆకస్మికంగా మరణిస్తే.. ఆ తర్వాత దానిని కట్టాల్సిన బాధ్యత ఎవరిది..? కుటుంబసభ్యులు కట్టాలా..? మాఫీ అవుతుందా..? చట్టం ఏం చెబుతోంది? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Loan: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ రుణం మాఫీ అవుతుందా..? రూల్స్ ఏం చెప్తున్నాయి..!
Personal Loan Repayment After Death
Krishna S
|

Updated on: May 04, 2026 | 11:00 AM

Share

నేటి ఆధునిక కాలంలో మధ్యతరగతి మనిషికి అప్పు అనేది ఒక అనివార్యమైన అవసరంగా మారింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు లేదా ఇంటి నిర్మాణం.. ఇలా కారణం ఏదైనా బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి లోన్ తీరకముందే ఆకస్మికంగా మరణిస్తే, ఆ బాధ్యత ఎవరిది? బ్యాంకు రికవరీ ఏజెంట్లు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చా? ఈ అంశంపై సామాన్యులకు తప్పక అవగాహన ఉండాలి.

పర్సనల్ లోన్ – చట్టం ఏం చెబుతోంది..?

బ్యాంకింగ్ రంగంలో పర్సనల్ లోన్స్ అన్‌సెక్యూర్డ్ లోన్స్ కిందకు వస్తాయి. అంటే ఈ రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకు ఎలాంటి ఆస్తిని హామీగా తీసుకోదు. కేవలం ఆ వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను బట్టి అప్పు ఇస్తుంది. చట్టం ప్రకారం.. తండ్రి లేదా భర్త తీసుకున్న వ్యక్తిగత అప్పును చెల్లించాల్సిన బాధ్యత చట్టపరంగా భార్యాపిల్లల మీద ఉండదు. ఒకవేళ మరణించిన వ్యక్తి పేరిట ఏదైనా ఆస్తి ఉండి, అది వారసులకు చెందాల్సి ఉంటే.. ఆ ఆస్తి విలువ మేరకు మాత్రమే అప్పును వసూలు చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది. వారసుల సొంత సంపాదన లేదా ఆస్తులను బ్యాంకు జప్తు చేయలేదు.

కో అప్లికెంట్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి..?

చాలా సందర్భాల్లో బ్యాంకులు భార్యాభర్తల పేరిట కలిపి లోన్ ఇస్తుంటాయి. ఇలాంటప్పుడు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రాథమిక రుణగ్రహీత మరణించినా.. లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన కో అప్లికెంట్ ఆ అప్పును తీర్చాల్సిందే. మరణించిన వ్యక్తి ఆదాయం ఆగిపోయినా, బ్రతికి ఉన్న భాగస్వామి బాకీ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించలేకపోతే వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

షూరిటీ లేదా గ్యారెంటర్

స్నేహితులకో, బంధువులకో సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలామంది లోన్ పేపర్లపై హామీదారుగా సంతకం చేస్తారు. ఒకవేళ అసలు రుణగ్రహీత మరణిస్తే, బ్యాంకు మొదట వారసులను సంప్రదిస్తుంది. వారు చెల్లించలేమని చెబితే.. వెంటనే గ్యారెంటర్ మెడకు ఆ ఉచ్చు బిగుస్తుంది. పర్సనల్ లోన్ ఒప్పందాల ప్రకారం.. అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పక్షంలో గ్యారెంటర్ ఆ బాకీని తీర్చడానికి చట్టబద్ధంగా అంగీకరించినట్లు లెక్క. అందుకే షూరిటీ ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

ఆస్తులను తాకట్టు పెట్టిన రుణాలు

పర్సనల్ లోన్ కోసం ఏదైనా ఆస్తిని షూరిటీగా పెడితే.. బ్యాంకుకు ఎవరినీ అడగాల్సిన పని లేదు. తమ దగ్గర ఉన్న బంగారాన్ని లేదా ఆస్తిని వేలం వేసి తమకు రావాల్సిన అసలు, వడ్డీని రికవరీ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే వారసులకు చెల్లిస్తుంది.

లోన్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత

ప్రస్తుతం చాలా బ్యాంకులు లోన్ ఇచ్చే సమయంలోనే క్రెడిట్ షీల్డ్ లేదా లోన్ ఇన్సూరెన్స్ ను కస్టమర్లచే చేయిస్తున్నాయి. ఒకవేళ రుణగ్రహీత మరణిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన బకాయిని బ్యాంకుకు కట్టేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులకు ఆస్తి దక్కుతుంది కానీ అప్పు మిగలదు. రుణం తీసుకునేటప్పుడు ఇలాంటి బీమా ఉందో లేదో సరిచూసుకోవడం కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద భద్రత.

రికవరీ ఏజెంట్ల వేధింపులు ఉంటే?

రుణగ్రహీత మరణించిన సమయంలో కుటుంబం మానసిక వేదనలో ఉంటుంది. అటువంటి సమయంలో రికవరీ ఏజెంట్లు వచ్చి బెదిరిస్తే, అది చట్టవిరుద్ధం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏజెంట్లు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. వారసులకు అప్పుతో సంబంధం లేదని తెలిసినప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ వేధింపులు ఎక్కువైతే పోలీసులకు లేదా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

లోన్ తీసుకోవడం ఎంత అవసరమో, దానికి సంబంధించిన నిబంధనలు తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం. రుణ ఒప్పంద పత్రాలపై సంతకం చేసే ముందు మరణం తర్వాత రికవరీ అనే కాలమ్‌ను జాగ్రత్తగా చదవండి. అప్పు గురించి కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇచ్చి ఉంచడం మేలు.

Follow Us