AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనస్ డబ్బు ఎక్కడ పెట్టాలి? ఈ గందరగోళ పరిస్థితుల్లో స్మార్ట్ పెట్టుబడి వ్యూహం ఇదే!

ప్రపంచ మార్కెట్ల అస్థిరత మధ్య బోనస్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్న పెట్టుబడిదారులకు నిపుణులు స్మార్ట్ వ్యూహాన్ని సూచిస్తున్నారు. ఆర్బిట్రేజ్ ఫండ్లు, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ SIPల కలయిక ద్వారా రిస్క్ తగ్గిస్తూ దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.

బోనస్ డబ్బు ఎక్కడ పెట్టాలి? ఈ గందరగోళ పరిస్థితుల్లో స్మార్ట్ పెట్టుబడి వ్యూహం ఇదే!
Invest Your Bonus
SN Pasha
|

Updated on: May 22, 2026 | 8:10 PM

Share

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు ప్రస్తుతం కీలక సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బోనస్ లేదా అదనపు ఆదాయం పొందిన చాలామంది, ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తున్నారు. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండగా, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లు స్వల్పకాలంలో రిస్క్‌గా కనిపిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 6 శాతం నుంచి 7.5 శాతం వరకు మాత్రమే రాబడులు ఇస్తుండగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇచ్చినా రిస్క్ కూడా అధికంగా ఉంది.

బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. అదనంగా సావరిన్ గోల్డ్ బాండ్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కూడా పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ టైమింగ్‌ను అంచనా వేయడం కంటే క్రమబద్ధమైన పెట్టుబడి విధానమే ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఫిడ్యూషియరీస్‌కు చెందిన సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అవినాష్ లుథ్రియా ప్రకారం, ఒకేసారి వచ్చిన పెద్ద మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించడం మంచిదని చెబుతున్నారు.

ఆయన సూచన ప్రకారం పెట్టుబడిలో సగం మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెట్టి, మిగిలిన సగాన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో 12 నెలల SIP రూపంలో పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మార్కెట్ పతనాల ప్రభావం కొంతవరకు తగ్గుతుందని, అలాగే దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్ వృద్ధి ప్రయోజనం పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం భారతీయ ఈక్విటీలు గత 20 ఏళ్లలో సగటున 11 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడులు ఇచ్చాయి. అదే సమయంలో బంగారం కూడా మంచి రాబడులు ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో ఈక్విటీలు ఎక్కువ సంపద సృష్టించాయని నివేదిక వెల్లడించింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2020 కోవిడ్ మార్కెట్ పతనం వంటి భారీ సంక్షోభాల తర్వాత కూడా మార్కెట్లు తిరిగి కోలుకుని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు లాభాలు అందించాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అందుకే భావోద్వేగాలకు లోనుకాకుండా, క్రమబద్ధమైన పెట్టుబడులే సంపద సృష్టికి కీలకమని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us