Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
మన దేశంలో చాలామంది బంగారం ప్రియులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు అయితే ఏదైనా పండగ వస్తే చాలు..
మన దేశంలో చాలామంది బంగారం ప్రియులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు అయితే ఏదైనా పండగ వస్తే చాలు.. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తెగ ఇష్టపడతారు. ఇదిలా ఉంటే.. ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడినప్పుడు, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు ఆకర్షితులవుతారు. అలాంటి వాటిల్లో బంగారం కూడా ఒకటి. అదేంటి బంగారంలో పెట్టుబడా.? రిస్కేమో.? అని మీరు ఆలోచించవచ్చు. టెన్షన్ వద్దు! మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంతున్నట్లయితే.? కచ్చితంగా ఈ విషయాలను గుర్తించుకోండి.
గడిచిన 12-15 ఏళ్లలో ప్రపంచ సంక్షోభాలు ఎదురైనప్పుడు మాత్రమే బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2008 ఆర్ధిక మాంద్యం తర్వాత.. కొన్ని సంవత్సరాల పాటు బంగారం డిమాండ్ ఎక్కువగా ఉండగా.. అనంతరం కొన్నాళ్లు మందకొడిగా సాగింది. 2019లో, అమెరికా – చైనా వాణిజ్య యుద్ధం కారణంగా మళ్లీ బంగారం పుంజుకుంది. 2020లో కరోనా కారణంగా బంగారం దాదాపు 30 శాతం రాబడిని ఇచ్చింది. 2021లో బంగారం ద్వారా రిటర్న్స్ ఏమి లేకపోగా.. 2022లో ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది.
సాధారణంగా చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడమంటే.. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు.. మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 5-10 శాతం బంగారంపై పెట్టుబడులు ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ పెట్టుబడులను భౌతికంగానే కాకుండా డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి వాటిల్లో కూడా చెయ్యొచ్చన్నారు.
డిజిటల్ గోల్డ్:
డిజిటల్ గోల్డ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్‌లో, పెట్టుబడిదారుడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేస్తాడు. బీమా చేసిన వాలెట్‌లో ఈ బంగారాన్ని నిల్వ ఉంచొచ్చు. మీరు దీన్ని ఎప్పుడైనా నగదు రూపంలోకి.. లేదా ఫిజికల్ గోల్డ్ రూపంలోకి రీడిమ్ చేసుకోవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్:
గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఆన్‌లైన్ స్టాక్ బ్రోకర్ అవసరం. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను షేర్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు రోజంతా ట్రేడ్ అవుతాయి. దీని కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎక్స్ఛేంజీల సహాయంతో సులభంగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే 1 గ్రాం గోల్డ్. ఇందులో ఎలక్ట్రానిక్ బంగారం మీ డీమ్యాట్ ఖాతాలో జమ చేయబడుతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్:
సావరిన్ గోల్డ్ బాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లో, ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 1 గ్రాం గోల్డ్ లేదా గరిష్టంగా 4 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ల పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అర్ధ వార్షిక ప్రాతిపదికన లభిస్తుంది. దీనిని రుణాలకు తాకట్టుగా కూడా ఉపయోగించవచ్చు. బంగారం స్వచ్ఛతకు గోల్డ్ బాండ్ పూర్తి హామీ ఇస్తుంది.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.