Creta electric: సింగిల్ చార్జింగ్ తో 473 కిలోమీటర్ల ప్రయాణం.. క్రెటా ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు ఇవే..!
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతోంది. పెట్రోలు, డీజిల్ వాహనాలకు బదులు వీటినే ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. మన దేశంలోని రోడ్లపై కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు సర్రున దూసుకుపోతున్నాయి. పట్టణాలలో అయితే ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే వీటి వినియోగం పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మన దేశంలో బాగున్నప్పటికీ కార్ల వినియోగం తక్కువనే చెప్పవచ్చు. ఈ లోటును భర్తీ చేసేందుకు కార్ల కంపెనీలు చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా హ్యుందాయ్ కంపెనీ నుంచి క్రెటా ఎలక్ట్రిక్ అనే కారు విడుదలైంది. దాని ప్రత్యేకతలు, ధర, రేంజ్ తదితర వివరాలను తెలుసుకుందాం. ఢిల్లీలో జరిగిన భారత్ మోబిలిట్ గ్లోబల్ ఎక్స్ పో 2025లో క్రెటా ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ విడుదల చేసింది. 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి సింగిల్ చార్జింగ్ తో 42 కేడబ్ల్యూహెచ్ 390 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. అలాగే 51.4 కేడబ్ల్యూహెచ్ మోడల్ కారులో 473 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 11 కేబ్ల్యూ ఏసీ చార్జర్ తో 4 నుంచి 4.30 గంటల్లోపు బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవచ్చు. అదే 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ చార్జర్ తో గంటలో పది నుంచి 80 శాతం, 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్ తో 39 నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ అనే ఐదు రకాల వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో స్మార్ట్ (o), ప్రీమియం, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ వేరియంట్లను ఎంచుకున్నఖాతాదారులు 11 కేడబ్ల్యూ కనెక్ట్ చేయబడిన వాల్ బాక్స్ చార్జర్ ను ఇన్ స్టాలేషన్ తో సహా రూ.73 వేలకు పొందవచ్చు. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఎగ్జిక్యూటివ్ (42 కేడబ్ల్యూహెచ్) రూ.17.99 లక్షలు
- స్మార్ట్ (42 కేడబ్ల్యూహెచ్) రూ.18.99 లక్షలు
- స్మార్ట్ (o)(42 కేడబ్ల్యూహెచ్) రూ.19.49 లక్షలు
- ప్రీమియం (42 కేడబ్ల్యూహెచ్) రూ. 19.99 లక్షలు
- స్మార్ట్ (o)(51.4 కేడబ్ల్యూహెచ్) రూ.21.49 లక్షలు
- ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ (51.4 కేడబ్ల్యూహెచ్) రూ.23.49 లక్షలు
ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) డేటా ప్రకారం.. మన దేశంలో 2024లో 42,74,793 యూనిట్ల ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో ఎలక్ట్రిక్ కార్లు 1,06,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం విక్రయాలతో పోల్చితే కేవలం 2.5 శాతం మాత్రమే వీటి వాటా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ కారుకు కస్టమర్ల ఆదరణ చాలా బాగుంటుందని, విక్రయాలు విపరీతంగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. హ్యుందాయ్ హోల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2026 నాటికి ఈవీ విక్రయాలను ఇప్పుడున్న శాతానికి రెట్టింపు చేయగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని పాపులర్ కార్లలో హ్యుందాయ్ విక్రయిస్తున్నక్రెటా ఒకటి. దాని పేరుతోనే ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చారు. డిజైన్ పరంగా కూడా పాత క్రెటాను పోలి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో మారుతీ సుజుకి ఇ విటారా, మహీంద్రా బీఈ 6, టాటా కర్వ్.ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ప్రముఖంగా ఉన్నాయి. వీటికి హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి