మెట్రో స్టేషన్‌కు దగ్గరగా నివశిస్తున్నారా? అయితే ఆర్థికంగా మీ జీవితంలో వచ్చిన ఈ మార్పును గమనించారా?
హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు సమీపంలో నివసించేవారికి ఆర్థిక ప్రయోజనాలున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) నివేదిక వెల్లడించింది. మెట్రో కనెక్టివిటీతో రవాణా ఖర్చులు తగ్గి, గృహ రుణ EMIల చెల్లింపు సులభమవుతుంది. ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గడంతో, ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతున్నాయి.

హైదరాబాద్ నగరం అంటేనే అదో కాంక్రీట్ జంగల్. మితిమీరిన జనాభా, భారీ సంఖ్యలో వాహనాలు, దాంతో ట్రాఫిక్ సమస్య.. ఇన్ని సమస్యలకు ఎంతో కొంత పరిష్కారంగా మెట్రో వచ్చింది. ఇప్పుడు మెట్రో కూడా కిటకిటలాడుతోంది. మెట్రో నిర్వాహణ అంశం పక్కనపెడితే.. మీ ఇల్లు మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉంటే మాత్రం మీకు తెలియకుండానే మీకు ఓ మంచి జరిగింది. అదేంటంటే.. ఆర్థికంగా మీరు బెటర్ అయ్యారు. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి (EAC-PM) చేసిన కొత్త పరిశోధనలో ఇది వెల్లడైంది. ఇప్పటివరకు మెట్రో రైలు నెట్‌వర్క్‌ల విస్తరణ ప్రయాణ సౌలభ్యం, ట్రాఫిక్‌ను తగ్గించడం, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. కానీ ఈ నివేదిక మరొక ప్రధాన ప్రయోజనాన్ని హైలైట్ చేస్తుంది.
నివేదిక ప్రకారం మెట్రో కనెక్టివిటీ ప్రజల రోజువారీ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ప్రజలు ప్రైవేట్ వాహనాలపై తక్కువగా ఆధారపడినప్పుడు, ఇంధనం, నిర్వహణ, పార్కింగ్, వాహన రుణాలు వంటి ఖర్చులు తగ్గుతాయి. ఇది గృహాల నెలవారీ ఆదాయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా వారు తమ గృహ రుణ EMIలను సకాలంలో, సులభంగా చెల్లించగలుగుతారు. ఈ నివేదిక ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను అధ్యయనం చేసింది. ఈ నగరాల్లో మెట్రో నెట్‌వర్క్‌ల విస్తరణకు ముందు, తరువాత గృహ రుణ చెల్లింపు ప్రవర్తనను పోల్చింది. ఫలితాలు గణనీయంగా ఉన్నాయి. సౌమ్య కాంతి ఘోష్, పులక్ ఘోష్ మరియు SBI ఆర్థికవేత్త ఫల్గుణి సిన్హా తయారు చేసిన ఈ EAC-PM వర్కింగ్ పేపర్, గత దశాబ్దంలో మెట్రోల వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు కుటుంబాల ఆర్థిక ఆరోగ్యాన్ని బలోపేతం చేశాయని, రుణ చెల్లింపు అలవాట్లను మెరుగుపరిచాయని చూపిస్తుంది.
హైదరాబాద్‌లో మెట్రో ప్రాంతాల్లో గృహ రుణాల డిఫాల్ట్‌లు దాదాపు 1.7 శాతం తగ్గాయి, ముందస్తు చెల్లింపులు లేదా EMI కంటే ఎక్కువ చెల్లించేవి 1.8 శాతం పెరిగాయి. బెంగళూరులో డిఫాల్ట్‌లు 2.4 శాతం తగ్గాయి, ముందస్తు చెల్లింపులు 3.5 శాతం పెరిగాయి. ఢిల్లీలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది, ఇక్కడ డిఫాల్ట్‌లు 4.42 శాతం తగ్గాయి. మెట్రో వచ్చినప్పటి నుండి ద్విచక్ర వాహనాలు, కార్ల కొత్త కొనుగోళ్లు తగ్గాయని కూడా నివేదిక చూపిస్తుంది. ప్రైవేట్ వాహనాల కంటే ప్రజలు ప్రజా రవాణాను ఎంచుకుంటున్నారని ఇది స్పష్టంగా సూచిస్తుంది. వాహనం కొనకపోవడం వల్ల రుణాలు తగ్గడమే కాకుండా నెలవారీ ఖర్చులు కూడా తగ్గుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
