Trai: టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర.. కీలక ఆదేశాలు జారీ.. హద్దులు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక..!
Trai: మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వవద్దని స్పష్టం..
Trai: మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వవద్దని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది.
కాగా, ప్రస్తుతం భారత్‌లో మొబైల్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
అసలు కారణం ఏంటంటే..
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నెంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారులను ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు.
ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్..
కాగా, మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ట్రాయ్ స్పందించింది. ఇష్టరీతిన ఆఫర్లు ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.