Gold: ప్రపంచంలోనే బంగారం నిల్వల్లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..? కళ్లు చెదిరే తాజా లెక్కలివే.. అమెరికా కంటే..
బంగారు నిల్వల్లో ఏ దేశం ముందు ఉంది? అనేది తెలుసుకోవాలని ఉందా.. ఇటీవల గణాంకాల ప్రకారం యూఎస్ తొలి స్థానంలో ఉంది. ఇక భారత్ కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను పెంచుకుంటుంది. భారత్ ఏ స్థానంలో ఉందనేది ఒకసారి చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీనికి ఒక ఆభరణంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా భావిస్తారు. అంతర్జాతీయంగా బంగారంలో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతూనే ఉన్నారు. అనేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇదే కాకుండా అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటాయి. ఆర్ధిక సంక్షోభ పరిస్దితుల్లో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకులు రికార్డ్ స్థాయిలో గోల్డ్‌ను కొంటుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బ్యాంకులు మరోసారి బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఏ దేశంలో ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయనేది చూద్దాం.
అగ్రస్థానం అమెరికాదే..
బంగారం నిల్వలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా వద్ద 8133.5 టన్నుల నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న బంగారం నిల్వల్లో 60 శాతం వాటా యూఎస్, యూరప్‌ది ఉంది. ఆర్ధిక సంక్షోభాల సమయంలో ఉపయోగపడుతుందనే కారణంతో అమెరికా, యూరప్ దేశాలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని వల్ల ఆ దేశాల దగ్గర ఎక్కువ నిల్వలు ఉండగా.. మరింతగా పెంచుకుంటున్నాయి.
భారత్ స్థానం ఎక్కడంటే..
భారత్ 8వ స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో జర్మనీ ఉండగా.. ఆ దేశం వద్ద 3351.6 టన్నుల బంగారం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఇటలీ వద్ద 2451 టన్నులు, ఫ్రాన్స్ వద్ద 2437 టన్నులతో నాలుగు స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో ఉన్న రష్యా దగ్గర 2333 టన్నులు, ఆరో స్థానంలో ఉన్న చైనా వద్ద 2279 టన్నులు, స్విట్జర్లాండ్ వద్ద 1040 టన్నులు ఉండగా.. ఈ దేశంలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ వద్ద 876.2 టన్నులు ఉండగా.. జపాన్ 845.9 టన్నులతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక టర్కీ 615 టన్నులతో పదో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఇటీవల కాలంలో బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది. రిజర్వ్ బ్యాంక్ తన ఆస్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, తమ పెట్టుబడులను వైవిధ్యపర్చుకోవడానికి గోల్డ్ నిల్వలను పెంచుకుంటుంది. ఇక చైనా వద్ద కూడా బంగారు నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆ దేశం అదనంగా 331 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇక పోలాండ్, టర్కీ వంటి దేశాలు కూడా నిల్వలను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్ధిక ఒడిదుడుకుల నుంచి రక్షించుకోవడానికి రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
