సంపన్నులంతా అక్కడే.. ఆ 10 రాష్ట్రాల చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. ఎందుకో తెలుసా..?
దేశంలోని 90 శాతం సంపద కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లోనే ధనవంతులు ఎందుకు పెరుగుతున్నారు..? అంటే అవకాశాల అసమానత ఈ ప్రాంతీయ ఆర్థిక వ్యత్యాసానికి ప్రధాన కారణం. దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

దేశం అభివృద్ధి చెందుతోంది.. బిలియనీర్లు పెరుగుతున్నారు. ఇది మంచి విషయమే. కానీ మన దేశ సంపద ఎంతమందికి చేరుతోంది..? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలో ఇప్పుడు రూ.1,000 కోట్లకు పైగా సంపద ఉన్నవారు ఏకంగా 1,687 మంది ఉన్నారు. వీరంతా దేశ సంపదను పంచుకుంటున్నారు. కానీ ఆ సంపద దేశమంతా సమానంగా లేదు.
90శాతం డబ్బు కేవలం 10 రాష్ట్రాల చేతుల్లోనే!
దేశంలోని మొత్తం సంపదలో 90 శాతానికి పైగా కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉంది. అంటే దేశంలోని దాదాపు అందరూ పెద్ద సంపన్నులు ఈ పది రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. మహారాష్ట్ర (ముంబై, ఢిల్లీ, కర్ణాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై), గుజరాత్ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో తెలంగాణ (హైదరాబాద్), ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్‌లు కూడా ఉన్నాయి.
మహారాష్ట్రను ఒక్కదాన్నే తీసుకుంటే అక్కడ 548 మంది రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగివున్నారు. ఢిల్లీలో 223 మంది ఉన్నారు. దీని అర్థం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలున్న చోటే డబ్బు ఎక్కువైపోతోంది.
అసమానతకు కారణం ఏంటి?
డబ్బు ఒకేచోట పేరుకుపోవడానికి ప్రధాన కారణం అవకాశాలు.
మంచి సదుపాయాలు: మెరుగైన రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు.
వ్యాపార వాతావరణం: వ్యాపారం చేయడానికి ప్రభుత్వం నుంచి సులభంగా అనుమతులు దొరకడం.
నైపుణ్యం ఉన్నవారు: మంచి చదువుకున్న, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దొరకడం.
పెట్టుబడులు: వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి డబ్బు సులభంగా దొరకడం.
ముంబై లేదా బెంగళూరు లాంటి నగరాల్లో ఒక కొత్త కంపెనీ పెడితే, దానికి పెట్టుబడి, కస్టమర్‌లు, తెలివైన ఉద్యోగులు సులభంగా దొరుకుతారు. అదే చిన్న పట్టణాల్లో ఈ సదుపాయాలు ఉండవు. అందుకే సంపద ఇక్కడే పెరుగుతోంది. మొత్తం మీద చెప్పాలంటే మన దేశం సంపదలో పెరుగుతున్నా, ఆ పెరుగుదల అందరికీ అందడం లేదు. కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉండగా, కొన్ని రాష్ట్రాలు మాత్రం మరింత ధనవంతం అవుతున్నాయి. దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే, వెనుకబడిన రాష్ట్రాల్లో కూడా మంచి సదుపాయాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




