Credit Score: ఆ స్కోర్ మెరుగ్గా ఉంటేనే వ్యాపార రుణాలు.. పెంచుకునే చిట్కాలివే..!
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. గతంలో రుణం అంటే తెలిసిన వారి దగ్గరో, వడ్డీ వ్యాపారులనో ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే వారు ఏదైన వస్తువు, లేదా స్థలం వంటి పత్రాలను హామీగా తీసుకుని ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ వృద్ధి నేపథ్యంలో పెద్ద మొత్తంలో అప్పు తక్కువ వడ్డీకే కావాలంటే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

దేశంలోని ప్రజలు రుణం కోసం బ్యాంకుల తలుపులు తడుతుంటే అసలు ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తున్నాయనే అనుమానం అందరికీ ఉంటుంది. అయితే బ్యాంకులు వినియోగదారుల క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తాయి. అయితే వ్యక్తులకు సిబిల్ స్కోర్ ఉన్నట్లే వ్యాపార సంస్థలకు కూడా సిబిల్ స్కోర్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకు బ్యాంకులు రుణాలను ఇస్తున్నాయి. సులభమైన వ్యాపార రుణాలను పొందడానికి బలమైన వ్యాపార క్రెడిట్ స్కోరు ముఖ్యం. ఒక కంపెనీకి మౌలిక సదుపాయాలు, పరికరాలు, వర్కింగ్ క్యాపిటల్ మొదలైన వాటికి డబ్బు అవసరమైతే సులభమైన వ్యాపార రుణాలను పొందడానికి మంచి బిజినెస్ క్రెడిట్ స్కోర్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చేందుకు చిట్కాలను ఓ సారి తెలుసుకుందాం.
సకాలంలో చెల్లింపులు
మీ కంపెనీ గత బిల్లులు, రుణాలు, సరఫరాదారు ఇన్‌వాయిస్‌లను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. ఆలస్యమైన లేదా తప్పిపోయిన చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బతీస్తాయి. సానుకూల పేమెంట్ హిస్టరీను నిర్వహించడానికి రిమైండర్‌లను ఉపయోగించాలి. లేని పక్షంలో చెల్లింపులను ఆటోమేట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వ్యాపార క్రెడిట్ ప్రొఫైలింగ్‌కు చెల్లింపుల చరిత్ర చాలా ముఖ్యమైనదనే విషయాన్ని గమనించాలని పేర్కొంటున్నారు.
క్రెడిట్ వినియోగ నిష్పత్తి
మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ క్రెడిట్ లైన్ రూ.10 లక్షలు అయితే మీరు రూ.3 లక్షల వరకు మాత్రమే ఉపయోగిస్తే ఉత్తమమని చెబుతున్నారు. ఈ నిష్పత్తిని మించిపోవడం మీ బిజినెస్ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన చాలా ముఖ్యమైన విషయమని వివరిస్తున్నారు.
అప్పుల నిర్వహణ
కొత్త రుణాలు తీసుకునే ముందు ఉన్న అప్పులు చక్కగా నిర్వహిస్తున్నామా? అనే విషయాన్ని గమనించారు. ముఖ్యంగా ఆ అప్పుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక కంపెనీకి రుణం-ఈక్విటీ నిష్పత్తి ఒకటి కంటే తక్కువగా ఉండాలి. అందువల్ల తిరిగి చెల్లింపులు లేకుండా మల్టిపుల్ లోన్ష్ ఉంటే బిజినెస్ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.
క్రెడిట్ ఖాతాలు
పాత క్రెడిట్ ఖాతాలను అరుదుగా ఉపయోగించినప్పటికీ తెరిచి ఉంచడం వల్ల కంపెనీ బిజినెస్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ రుణదాతలకు మీ దీర్ఘకాలిక ఆర్థిక ప్రవర్తన, రీ పేమెంట్ హిస్టరీ, విశ్వసనీయత, స్థిరత్వం గురించి తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








