Success story: అత్తెసరు మార్కులతో అత్యుత్తమ స్థాయికి.. స్ఫూర్తిదాయక యువకుడి గురించి తెలుసుకోవాల్సిందే..!
సాధారణంగా ఒక విద్యార్థి భవిష్యత్తును అతడికి వచ్చే మార్కుల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే జీవితంలో అంత ఉన్నత స్థితికి చేరతాడని, మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని భావిస్తారు. ఈ కారణంతోనే పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. మంచి మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తీవ్ర మానసిక ఒడిదొడుకులకు లోనవుతున్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా మార్కుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కానీ పిల్లల భవిష్యత్తు అతడికి వచ్చే మార్కులపై ఆధారపడి ఉండదు.

మహారాష్ట్రకు చెందిన రోహిత్ ఉగలే జీవితమే దీనికి నిదర్శనం. పదో తరగతిలో తక్కువ మార్కులు తెచ్చుకున్న అతడు సొంతంగా కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పించాడు. మహారాష్ట్రలోని సిన్నార్ అనే గ్రామానికి చెందిన రోహిత్ ఉగలే అందరిలాగే చదువును కొనసాగించాడు. అతడు సీబీఎస్ఈ సిలబస్ లో పదో తరగతి పరీక్షలు రాశాడు. అతడికి సుమారు 90 శాతం మార్కులు వస్తాయని తల్లిదండ్రులు అంచనా వేశారు. కానీ రోహిత్ కేవలం 78 శాతం మార్కులు మాత్రమే తెచ్చుకోగలిగాడు. దీంతో అతడిపై తల్లిదండ్రులు కోప్పడ్డారు. మార్కులతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని హితవు పలికారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే విద్యార్థులు నిరాశకు గురవుతారు. చిన్నవయసులో మానసికంగా ఆందోళన చెందుతారు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా కోప్పడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. కానీ రోహిత్ ఉగలే మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. మార్కులు తక్కువ వచ్చాయని ఏమాత్రం నిరాశపడలేదు. జీవితంలో విజయం సాధించడానికి మార్కులు ప్రామాణికం కాదు అని రుజువు చేయాలనుకున్నాడు. రోహిత్ తన లక్ష్యం సాధించడానికి వేగంగా అడుగులు వేశాడు. దాని కోసం డిజిటల్ ప్రపంచం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. వెబ్ సైట్ లను రూపొందించడం, చిన్న ప్రాజెక్టులపై పనిచేయడం మొదలుపెట్టాడు. కొత్త నైపుణ్యాలను పెంచుకుంటూ తనను తను మెరుగుపర్చుకున్నాడు. కోడింగ్, సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ పై రోహిత్ కు ఎంతో ఆసక్తి పెరిగింది. ఎటువంటి శిక్షణ లేకుండానే పట్టుదలతో పీహెచ్పీ, జావా వంటి ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకున్నాడు.
రోహిత్ చిన్న వయసులోనే కొత్త చరిత్ర నెలకొల్పాడు. అతడికి కేవలం 16 ఏళ్ల వయసు ఉండగానే 2017లో ఎస్ఏటీఎంఏటీ టెక్నాలజీస్ అనే ప్రైవేటు లిమిటెడ్ ను స్థాపించాడు. దీన్ని కేవలం ఒక చిన్న గదిలో ఏర్పాటు చేయడం గమనార్హం. పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే గుణం అతడిని క్రమంగా ముందుకు తీసుకువెళ్లాయి. చిన్న కంపెనీ క్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 110 మంది ఉద్యోగులు ఎస్ఏటీఎంఏటీ టెక్నాలజీస్ లో పనిచేస్తున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లోని క్లయింట్లకు కూడా ఈ కంపెనీ సేవలు అందజేస్తోంది. అలాగే ఉత్తమ ఐటీ సెటప్ కంపెనీ అవార్డును కూడా సాధించింది.