Income Tax Return Filing: మొదటి సారి ఐటీఆర్ ఫైల్ చేసే వారికి అలర్ట్.. రూ. 5,000 పెనాల్టీ తప్పించుకోవాలంటే ఇవి ఫాలో అవ్వండి..
2023 జూలై 31లోపు కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆగస్టు 1, నుంచి రూ. 1,000 లేదా రూ. 5,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు రూ. 1,000, రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5000లను అపరాధ రుసుంగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వసూలు చేస్తుంది.

ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి తుది గడువు సమీపిస్తోంది. ఎటువంటి పెనాల్టీలు లేకుండా ఈ ప్రక్రియను పనిని పూర్తి చేయడం అంటే అదో పెద్ద సవాలనే చెప్పాలి. అది కూడా మొదటి సారి చేసే వారికి మరింత కష్టంగా ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రక్రియ సామాన్య ప్రజలకు ఓ పట్టాన అర్థం కాదు. అందుకే చాలా మంది ఆడిటర్ల సాయం తీసుకుంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేది. మీరు ఒకవేళ ఉద్యోగి అయితే, పన్ను పరిధిలోకి వచ్చే వారైతే, లేదా ఫ్రీలాన్సర్ అయినా, వ్యాపారం చేసే వారు అయినా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. అయితే మీరు మొదటి సారి పన్ను దాఖలు చేస్తున్నట్లు అయితే కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకోవ్సాల్సి ఉంటుంది. లేకుంటే పెనాల్టీలు, అపరాధ రుసుంలు భరించాల్సి వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తగిన ట్యాక్స్ రెజీమ్‌ను ఎంచుకోవాలి.. ప్రస్తుతం మన దేశంలో రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. పాత పన్ను విధానం, అలాగే ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన కొత్త పన్ను విధానం. వీటిలో మీ ఆర్థిక అవసరాలకు బాగా సరిపోయేదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాలు.. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు, మీ వద్ద వ్యక్తిగత వివరాలు, పన్ను ప్రకటన, పెట్టుబడి, ఆదాయ రుజువులు వంటి అవసరమైన పత్రాలు అన్ని ఉన్నాయని నిర్ధారించుకోండి. అదనంగా, మీకు మీ కంపెనీ నుంచి ఫారమ్ 16, ఫారం 26ఏఎస్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్(ఏఐఎస్) అవసరం. మీకు ఏవైనా రుణాలు ఉంటే, వడ్డీ సర్టిఫికెట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.
సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి.. ఆదాయపు పన్ను శాఖ వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారుల కోసం వివిధ ఐటీఆర్ ఫారమ్‌లను జారీ చేస్తుంది. మీ ఆదాయం, ప్రొఫైల్ ఆధారంగా ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 నుండి తగినదాన్ని ఎంచుకోండి.
మీ ఐటీఆర్‌ని వెరిఫై చేయండి.. మీ ఐటీఆర్‌ని వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మొదటిసారి ఫైల్ చేసేవారు తప్పనిసరిగా ఈ పని చేయాలి. ఫైల్ చేసిన 30 రోజులలోపు అలా చేయడంలో విఫలమైతే మీ ఐటీఆర్ చెల్లదు. జరిమానాలు పడకుండా ఉండాలంటే మీరు మీ ఐటీఆర్‌ని జూలై 31, 2023లోపు ఫైల్ చేశారని వెరిఫై చేసుకొని నిర్ధారించుకోవాలి.
పెనాల్టీలు ఇలా..
2023 జూలై 31లోపు కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆగస్టు 1, నుంచి రూ. 1,000 లేదా రూ. 5,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు రూ. 1,000, రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5000లను అపరాధ రుసుంగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విధిస్తుంది. అందుకే పైన తెలిపిన ఈ నాలుగు మార్గదర్శకాలను అనుసరించి, మీరు మీ ఐటీఆర్‌ను సమర్థంగా ఫైల్ చేస్తే ఎటువంటి పెనాల్టీ బారిన పడకుండా సజావుగా సమయానికి ప్రక్రియ పూర్తవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







