AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ పంట వేస్తే రైతులకు కాసుల పంటే – తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం. అందుకే ఇప్పుడు రైతుల చూపు శ్రీగంధం పెంపకంపై పడింది. ఆయుర్వేదంలో విలువైన ఈ మొక్క సాగు చేయాలనుకుంటే తెలంగాణ అటవీశాఖ చక్కటి అవకాశం కల్పిస్తోంది. శిక్షణ కార్యక్రమాల నుంచి నాణ్యమైన మొక్కల వరకూ అందుబాటులోకి తెస్తోంది. 30 ఏళ్లకు ఎకరానికి 6 టన్నుల దిగుబడి వస్తుంది.

Telangana: ఈ పంట వేస్తే రైతులకు కాసుల పంటే - తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
Srigandham
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2025 | 9:17 PM

Share

శ్రీగంధం మొక్కలు పెంచితే అత్యధిక లాభాలు పొందవచ్చని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు, ఆసక్తి ఉన్నవారికి తెలంగాణ అటవీ శాఖ అధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించి.. సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తాజా డేటా ద్వారా తెలుస్తోంది. ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషదాలలో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగరబత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్‌లలో ఎంత విరివిగా ఉపయోగిస్తారు. మంచి ఆదాయ వనరుగా మారడంతో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు. శ్రీగంధం సాగు చేపట్టే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

శ్రీ గంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల మంచి లాభాలు గడించవచ్చు.

శ్రీగంధం చెట్టు వేడి, గాలిలో తేమ కలిగిన వాతావరణంలో, వర్షపాతం కలిగిన ప్రాంతాలలో పెరుగుతుంది. బిందు సేధ్యంతో సాగు అనుకూలంగా ఉంటుంది. శ్రీగంధం చెట్టు 30 సంవత్సరాలకు 25 కిలోల వరకు చేవ ఇస్తుంది. ఎకరానికి 250 చెట్లు నాటుకుంటే ఇంచుమించు 6 వేల కిలోలకు పైగా దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శ్రీగంధం నాణ్యతను బట్టి 8వేల వరకు పలుకుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే పంట కావటం, పెట్టుబడి తక్కువగా ఉండటంతో రైతులు శ్రీగంధం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే శ్రీగంధం సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. రాష్ట్ర అటవీ శాఖ పరిశోధనా విభాగం , ఫారెస్ట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ సిద్ధిపేట జిల్లా ములుగులో అభివృద్ధి చేసిన శ్రీగంధం మొక్కల అందిస్తంది. నాణ్యమైన శ్రీగంధం మొక్కలను విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కొక్క మొక్కను రూ.25 చెల్లించి, కావల్సిన మొక్కలను తీసుకోవాలని కోరుతోంది ఫారెస్ట్‌ రిసెర్చ్‌ విభాగం. రైతులు, ఉద్యానవన ఔత్సాహికులు, ఇతర పర్యావరణ ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాన అటవీ శాఖ పరిశోధనా విభాగం కోరుతోంది. మరిన్ని వివరాల కోసం స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌, హైదరాబాద్‌ వారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆసక్తి కలిగిన రైతులు.. 85007-71349, 97034-33429, 94408-15592 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..