AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్ స్కీమ్. పోస్టాఫీసులో దీనిని మీరు సులువుగా తెరవొచ్చు. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా అత్యధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్టుబడి కావడంతో ఎలాంటి రిస్క్ ఉండదు.

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?
Money
Venkatrao Lella
|

Updated on: Aug 24, 2026 | 4:51 PM

Share

సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు, పింఛన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోనూ పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందునుంచే డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చాలామంది డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో సీనియర్ సిటిజన్లు వీటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.

అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక ఆదాయం పొందటంతో పాటు ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి మార్గం ఒకటి ఉంది. అదే సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో కూడిన ఈ స్కీములో ఎలాంటి రిస్క్ ఉండదు. మీ పెట్టుబడి పూర్తి సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకం స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉండదు. దీంతో మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సీనియర్ సిటిజన్లు రిస్క్ కోరుకోరు. అంతేకాకుండా స్థిరమైన పెట్టుబడి కోసం చూస్తారు. అలాంటివారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు అన్నింటిలోనూ ఈ స్కీములోనే అత్యధిక వడ్డీ రేటు ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును కేంద్రం సవరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేట్లు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు స్థిరంగా ఉంచుతుంది. చాలాకాలంగా వడ్డీ రేట్లను కేంద్రం మార్చడం లేదు. ఈ పథకంలో కేవలం 60 ఏళ్లు దాటినవారు మాత్రమే చేరగలరు. మిగతావారు పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేదు. కనీసం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో వడ్డీ జమ అవుతూ ఉంటుంది. అంటే మీకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆదాయం వస్తుందన్నమాట.

మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత మొత్తం ఒకేసారి అకౌంట్లో జమ చేస్తారు. అయితే ఐదేళ్ల తర్వాత అవసరమైతే మరో మూడేళ్లు పెంచుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకేసారి రూ.30 లక్షలు జమ చేశారనుకుందాం. 8.2 శాతం వడ్డీ చొప్పున ప్రతీ మూడు నెలలకు రూ.61,499 వడ్డీ అందుతుంది. పాత పన్ను విధానం కింద గరిష్టంగా ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక రూ.24.39 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతీ మూడు నెలలకు రూ.50 వేల వడ్డీ లభిస్తుంది.

Follow Us