Khammam: మామిడి తోటకు వెళ్లిన రైతు.. ఏదో అలికిడి అనిపించి.. ఏంటా అని చూడగా..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం మామిడి తోటల్లో అడవి దున్న హల్‌చల్ చేసింది. తోటలోకి వచ్చిన అడవి దున్న ఓ రైతును వెంటాడటంతో అతడు ప్రాణభయంతో మామిడి చెట్టెక్కి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు దున్నను అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా చీకటి పడటంతో వెనుదిరిగారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, దున్నకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం మామిడి తోటల్లో అడవి దున్న హల్‌చల్ చేసింది. ఆదివారం సాయంత్రం తోటలోకి ప్రవేశించిన అడవి దున్న రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. తోటను పరిశీలించేందుకు వెళ్లిన ఓ రైతుకు అకస్మాత్తుగా కొమ్ములతో నల్లటి ఆకారంలో అడవి దున్న కనిపించడంతో భయంతో పరుగులు తీశాడు. అయితే అడవి దున్న అతడిని వెంటాడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన రైతు గొర్ల మాధవరెడ్డి చివరకు ఓ మామిడి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం చెట్టుపైనుంచే గ్రామస్థులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత తోట వద్దకు చేరుకున్న గ్రామస్థులు దూరంగా నిలబడి కేకలు వేయడంతో అడవి దున్న అక్కడి నుంచి కదిలింది. దీంతో మాధవరెడ్డి చెట్టు దిగి గ్రామస్థుల వద్దకు చేరుకున్నాడు.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు కూడా అక్కడికి చేరుకుని అడవి దున్నను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో తెల్లవారిన తర్వాత దున్నను అడవిలోకి తరలించే చర్యలు చేపడతామని అధికారులు వెనుదిరిగారు. అడవి దున్న తోటల్లోనే సంచరిస్తుండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, దానికి దగ్గరగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. సత్తుపల్లి ఓసీ-2లో జరిగిన సింగరేణి బాంబు పేలుళ్ల శబ్దాలకు భయపడిన అడవి దున్న చౌడవరం వైపు వచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
