AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best retirement plans: రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు

రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత కీలకం. దాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే జీవితంలో ఆర్ధిక ఒడిదొడుకులు ఉండవు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించే అవకాశం కలుగుతుంది. ఈ విషయం చాాలా మంది తెలిసిందే అయినప్పటికీ, దాని ప్రణాళికాబద్ధంగా అమలు చేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారికి రిటైర్మెంట్ పథకాల గురించి తెలియకపోవడమే. ఈ నేపథ్యంలో మన దేశంలో అమల్లో ఉన్న మూడు ప్రధాన రిటైర్మెంట్ పథకాల గురించి తెలుసుకుందాం. వాటిలో డబ్బులను పెట్టడానికి ఉన్న అవకాశాలు, రాబడి, వడ్డీ, రిస్కు వివరాలు ఇవే. 

Best retirement plans: రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
Retirement Plan
Nikhil
|

Updated on: Jan 13, 2025 | 1:15 PM

Share

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన దీర్ఘకాలిక పొదుపు పథకం. ఎటువంటి రిస్కు లేకుండా ఆదాయం కోరుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి 15 సంవత్సరాలు. దీనిపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తారు. ఈ రేటును ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనిలోని డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80 సీ కింద రూ.1.50 లక్షల వరకూ అందజేస్తారు. ఈ పథకంపై డిపాజిట్ పై వడ్డీకి పన్ను ఉండదు. పీపీఎఫ్ కు ప్రభుత్వం మద్దతు ఉంటుంది. వచ్చే రాబడికి దాదాపు హామీ లభిస్తుంది. పన్ను రహిత వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయం అదనపు ప్రయోజనాలు. అయితే 15 ఏళ్ల లాక్ ఇన్ పిరియడ్ లిక్విడిటీని పరిమితం చేస్తుంది. దీనిలో వచ్చే రాబడులు.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించకపోవచ్చు.

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)

ఈపీఎఫ్ అనేది చాలా మందికి తెలిసిన పథకం. 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్న ప్రతి సంస్థలోనూ దీన్ని అమలు చేస్తారు. ప్రతి నెలా ఉద్యోగి, కార్మికుడికి వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని దీనిలో జమ చేస్తారు. దానికి సమాన మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం అందజేస్తుంది. ఉద్యోగి జీతంలో సుమారు 12 శాతం కట్ చేసి ఈపీఎఫ్ లో జమ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దీనిపై 8.15 శాతం వడ్డీ రేటు అందజేస్తున్నారు. ప్రభుత్వం పర్యవేక్షణ ఉండడంతో రిస్కు ఉండదు. ఈపీఎఫ్ డిపాజిట్లపై రూ.1.50 లక్షల వరకూ ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. పదవీ విరమణ వరకూ ఉంచితే మెచ్యూరిటీ రాబడులపై పన్ను ఉండదు. ఉద్యోగితో పాటు యజమాని కూడా డబ్బులను జమ చేయడంతో పొదుపు పెరుగుతుంది. విద్య, ఇంటి కొనుగోలు, వైద్యం, అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. పీపీఎఫ్ తో పోల్చితే వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. అయితే జీతం పొందే వ్యక్తులకు మాత్రమే దీన్ని పరిమితం చేశారు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఎన్పీఎస్ అమలవుతుంది. ఇది మార్కెట్ లింక్డ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్. దీనిలో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు కలిపి ఉంటాయి. దేశంలోని పౌరులందరూ దీనిలో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. పదవీ విరమణ అంటే దాదాపు 60 ఏళ్ల వచ్చే వరకూ ఉంటుంది. వడ్డీ, రాబడులు 8 నుంచి 10 శాతం వరకూ ఉంటాయి. షరతులతో కూడిన పరిమిత ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ నుంచి వచ్చే రాబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. మెచ్యురిటీ కార్పస్ లో 60 శాతం పన్ను రహితం, మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా ఉపయోగించాలి. దీనిపై పన్ను విధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి