ముఖేష్ అంబానీ మాస్టర్‌మైండ్.. ఇరాన్ నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు!
ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనూహ్య మార్పుల మధ్య, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ ముడిచమురును కొనుగోలు చేసింది. అమెరికా తాత్కాలిక ఆంక్షల సడలింపును ఉపయోగించుకుని 5 మిలియన్ బ్యారెళ్లను కొనుగోలు చేయడంతో, 2019 తర్వాత భారత్ ఇరాన్ చమురును తిరిగి దిగుమతి చేసుకుంటోంది.

ప్రపంచ ఇంధన మార్కెట్లలో మారుతున్న పరిస్థితుల మధ్య భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ, అమెరికా తాత్కాలిక ఆంక్షల సడలింపును ఉపయోగించుకుని సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చమురును నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (NIOC) నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. వాణిజ్య వర్గాల ప్రకారం ఈ చమురు ధర ఐసిఇ బ్రెంట్ ఫ్యూచర్స్‌తో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 7 డాలర్ల ప్రీమియంతో ఉండడం గమనార్హం. అయితే ఈ సరఫరా ఎప్పుడు భారత్‌కు చేరుకుంటుందన్న దానిపై స్పష్టత ఇంకా లభించలేదు.
ఇటీవలి కాలంలో ఇరాన్ చమురు ప్రధానంగా చైనా స్వతంత్ర రిఫైనరీల ద్వారా కొనుగోలు అవుతూ, ఇతర దేశాల పేర్లతో మార్కెట్లోకి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారతీయ రిఫైనరీ ఈ కొనుగోలు చేయడం అంతర్జాతీయ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కాలంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించబడిన విషయం తెలిసిందే. తాజాగా సముద్రంలో ఇప్పటికే ఉన్న చమురు సరఫరాలపై 30 రోజుల తాత్కాలిక మినహాయింపును ప్రకటించడం వల్ల ఈ ఒప్పందం సాధ్యమైనట్లు భావిస్తున్నారు. ఈ మినహాయింపు మార్చి 20లోపు లోడ్ చేయబడిన, ఏప్రిల్ 19లోగా డెలివరీ అయ్యే చమురుకు వర్తిస్తుంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, 2019 మేలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుండి ఇప్పుడు మొదటిసారిగా ఇలాంటి కొనుగోలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో సరఫరా కొరతను ఎదుర్కొనేందుకు భారతీయ రిఫైనరీలు ఇటీవల రష్యా నుంచి కూడా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. ఇతర ఆసియా దేశాల రిఫైనరీలు కూడా ఇరాన్ చమురు కొనుగోలుపై పరిశీలన జరుపుతున్నప్పటికీ, చైనాకు చెందిన ప్రముఖ సంస్థ సినోపెక్ మాత్రం ఈ దిశగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
