Old Vehicles: వాహనదారులకు కేంద్రం షాకింగ్ న్యూస్.. పాత వాహనాలపై భారీగా పెరగనున్న చార్జీలు.. ఎప్పటి నుంచి అంటే
Old Vehicles: వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. తాజాగా ఓ ముఖ్యమైన అలర్ట్‌ను ప్రకటించింది. దీంతో కొత్త నిబంధనలు..
Old Vehicles: వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. తాజాగా ఓ ముఖ్యమైన అలర్ట్‌ను ప్రకటించింది. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అమలులోకి వస్తుండటంతో పాత వాహనాలు ఉన్న వారిపై ఈ ఎఫెక్ట్ పడనుంది. పాత వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి వాటి రెన్యూవల్ గురించి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 15 ఏళ్ల నాటి ట్రక్, బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్‌కు 8 రెట్లు అధిక చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్లు దాటితే రూ.1500 కాకుండా రూ.12500 ఫీజు చెల్లించాలి. అలాగే 15 ఏళ్ల నాటి పాత కారు విషయానికి వస్తే.. రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు రూ.5 వేల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ చార్జీ రూ.600 ఉంది. అదే పాత ద్విచక్ర వాహనాలకు రూ.300 కాకుండా రూ.1000 రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుంది.
దిగుమతి చేసుకున్న కార్లకు..
ఇక దిగుమతి చేసుకున్న కార్లు, ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు రూ.10 వేలు కాకుండా రూ.40 వేలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత రోజు గడిచే కొద్ది రూ.50 అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (స్మార్ట్ కార్డ్ రకం) గడువు ముగిసిపోతే రూ.200 అదనంగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యం అయితే రూ.300 నుంచి రూ.500 వరకు చార్జీ చెల్లించుకోవాలి.