Medicine Prices: గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మందుల ధరలు పెంపు.. ఇవి తగ్గింపు

ఏప్రిల్‌ 1నుంచి వినియోగదారులకు మరింత భారం పడనుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అవసరమయ్యే మందుల ధరలు పెరుగుతుంటే మరికొన్ని మందుల ధరలు తగ్గనున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఒకటి గుడ్‌న్యూస్.. మరొకటి బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. సాధారణంగా ఉపయోగించే కొన్ని మందుల ధరలు తగ్గుతుంటే..

Medicine Prices: గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మందుల ధరలు పెంపు.. ఇవి తగ్గింపు
Medicine Prices
Follow us

|

Updated on: Apr 01, 2023 | 6:47 AM

మార్చి నెల ముగియబోతోంది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్‌ నెల రాబోతోంది. దీంతో ఎన్నో నిబంధనలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ నెల నుంచి సామాన్యుల జేబులకు చిల్లులు పడనున్నాయి. ఎంతోకంటే నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన మందుల ధరలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌, యాంటీఇన్ఫెక్టివ్స్‌ వంటివి ఉన్నాయి. తాజా పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800కుపైగా మందులపై పడనుంది.

27 రకాల చికిత్సలకు సంబంధించిన సుమారు 900 మిశ్రమాలలో వినియోగించే 384 పదార్థాల ధరలు 12 శాతం పెరిగినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలే ఈ ధరల పెంపునకు కారణమని తెలుస్తోంది. మందుల్లో ఉపయోగించే ముడిపదార్థాలు, ఏపీఐ రేట్లు పెరిగిన నేపథ్యంలో ధరల పెరుగుదలకు అనివార్యమైంది. అలాగే సరుకుల రవాణాతోపాటు ప్యాకింగ్‌ ధరలు కూడా పెరగనున్నట్లు సదరు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల లైసెన్స్‌లు రద్దు మరో వైపు 18 ఫార్మాస్యూటికల్‌ కంపెనీలకు కేంద్రం షాకిచ్చింది. నకిలీ మందులను తయారు చేస్తున్న 18 ఫార్మాస్యూటికల్‌ కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేసింది కేంద్రం. గత సంవత్సరం అక్టోబర్‌ నుంచి అమెరికా, ఉజ్బెకిస్థాన్‌, గాంబియా దేశాల్లో భారత్‌ కంపెనీ నకిలీ ఔషధాల వ్యవహారం బట్టబయలు కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ పరిధిలోని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, బీహార్‌, గుజరాత్‌, గోవా, హర్యానా, జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ మందుల ధరలు తగ్గింపు

ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మందులు కీలక పాత్ర పోషిస్తాయనే చెప్పాలి. అలాంటి కొన్ని రకాల మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతుంటే మరికొన్ని మందుల ధరలు తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై విదేశాల నుంచి మందులను దిగుమతి చేసుకోవాల్సిన దేశ ప్రజలకు భారత ప్రభుత్వం ఎంతో ఊరటనిచ్చింది. నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021 కింద జాబితా చేయబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం దిగుమతి చేసుకున్న మందులపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ మందుల ధరలు తగ్గనున్నాయి.

వ్యక్తిగత ఉపయోగం కోసం ఔషధాలను దిగుమతి చేసుకునే వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అలాగే, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ (కీట్రూడా)పై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి వ్యక్తిగత దిగుమతిదారు సెంట్రల్ లేదా స్టేట్ హెల్త్ సర్వీస్ డైరెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి.

పన్ను ఎంత?

అయితే ఇటువంటి మందులపై 10 శాతం ప్రాథమిక సుంకం విధించబడుతుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇంజెక్షన్లపై 5 శాతం పన్ను ఉంచబడుతుంది. వెన్నెముక కండరాల క్షీణత లేదా కండరాల బలహీనత చికిత్స కోసం కొన్ని ఔషధాలకు ఇప్పటికే మినహాయింపు ఇచ్చినప్పటికీ.. ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల కోసం కస్టమ్ డ్యూటీ రిలీఫ్ కోసం కేంద్రం అనేక అభ్యర్థనలను స్వీకరించింది. దీని తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు లేదా ప్రత్యేక ఆహార ఖర్చులు ఉన్నాయి. అలాగే వాటిని దిగుమతి చేసుకుంటారు. పీఐబీ ప్రకారం.. కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు సంవత్సరానికి 10 కిలోల బరువున్న పిల్లలకు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. వయస్సు, బరువుతో పాటు ఔషధం మోతాదు, ధర పెరుగుతుంది. ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపు దేశంలోని చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి